సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించండి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల స్థల సేకరణపై బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని, ప్రస్తుత విద్యుత్ ఉప కేంద్రాలకు సమీపంలోని ప్రభుత్వ భూములు, వినియోగానికి వీలుకాని భూములను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర సంబంధ అధికారులంతా కలిసి పనిచేయాలన్నారు. ఒక్కో సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు ఐదెకరాలకు పైగా భూమి అవసరమని తెలిపారు. 

ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ఆరా..

జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే చివరి అంకానికి చేరుకుందని తెలిపారు. ఇప్పటివ రకు నిర్వహించిన సర్వే వివరాలను మండలాల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన సర్వేను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఏడీ ల్యాండ్ సర్వేయర్ సుదర్శన్, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.