ఇన్​స్టాగ్రామ్‎లో యువతి ట్రాప్.. 20 రోజులు నిర్బంధించి లైంగిక దాడి

బషీర్ బాగ్, వెలుగు: ప్రేమ పేరుతో నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ యువతిని మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన కృష్ణచైతన్య ఇన్​స్టాగ్రామ్‎లో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సదరు యువతిని హైదరాబాద్‏కు వచ్చేలా చేసి, 20 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అండ్​ఉమెన్  సేఫ్టీ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి నగరానికి చేరుకున్న అనంతరం నారాయణగూడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెను నిర్బంధించాడు. 

పెళ్లి పేరుతో లైంగికదాడి చేశాడు. 20 రోజులుగా పెళ్లి విషయాన్ని దాటవేస్తూ యువతిని లైంగికంగా వేధించాడు. యువతికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో స్థానిక కింగ్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్‪కు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో హోటల్ రూమ్ డోర్ లాక్  చేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి, లైవ్ లొకేషన్‮కు
చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

వెంటనే స్పందించిన షీ టీమ్, నారాయణగూడ పోలీసుల సహకారంతో బాధిత యువతిని రెస్క్యూ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణ చైతన్యను అరెస్ట్  చేశారు. నిందితుడు హైదరాబాద్‌లో బీటెక్  పూర్తి చేసి, సాఫ్ట్​వేర్  కోర్స్  చేస్తున్నాడని, అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‏కు తరలించినట్లు నారాయణగూడ ఇన్స్​పెక్టర్  చంద్రశేఖర్  తెలిపారు.