హోండా, నిస్సాన్ విలీనం.. చైనాను దెబ్బకొట్టేందుకు ఎత్తుగడ.. మూడో అతిపెద్ద ఆటోకంపెనీగా అవతారం

ఆటోమొబైల్ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధమైంది. మార్కెట్ షేర్ ను లాగేసుకున్న చైనాకు షాక్ ఇచ్చేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు నిస్సాన్, హోండా చేతులు కలిపాయి. జపాన్ కు చెందిన ఈ రెండు కార్ల తయారీ కంపెనీలు ఈవీ స్పేస్ లో చైనాకు చెక్ పెట్టేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాయి. మూడవ అతిపెద్ద మార్కెట్ లీడర్ గా ఎదిగేందుకు చేతులు కలుపుతున్నట్లు నిస్సాన్, హోండా సోమవారం (డిసెంబర్ 23, 2024) ప్రకటించాయి.

మెర్జర్ ఎందుకు:

చైనాలో బైద్ (Byd) లాంటి స్థానిక కంపెనీలు సేల్స్ పరంగా నిస్సా్న్, హోండా మార్కెట్ షేర్ ను లాగేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లో సేల్స్ క్షీణించి, మార్కెట్ షేర్ కోల్పోవడంతో ఈ రెండు కంపెనీలు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు కంపెనీలు మెర్జ్ అయ్యి.. చైనాలో టాప్ 3 పొజిషన్ కు చేజిక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాయి. 

ఈ అంశంపై హోండా సీఈఓ తోషిరో మిబె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత వేగంగా పుంజుకుంటున్న ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్స్), కృత్రిమ మేధతో కూడిన డ్రైవింగ్ వంటి అధునాతన సాంకేతికతలో ముందంజలో ఉండాలని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఈ మెర్జర్ వలన ఏర్పడబోయే కొత్త ఎంటిటీ సుమారు 194 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధిస్తుందని ప్రకటించారు.

Also Read :- బ్యాంకు మూతపడితే.. డబ్బు మొత్తం తిరిగి ఇస్తారా..?

చైనాలో బైద్ (Byd) లాంటి స్థానిక కంపెనీలు హోండా, నిస్సాన్ మార్కెట్ షేర్ ను కొల్లగొట్టాయి. దీంతో ఈ కంపెనీల రెవెన్యూ పూర్తిగా పడిపోయింది. భారీ నష్టాల కారణంగా హోండా ప్రొడక్షన్ ను 20 శాతం తగ్గించుకోగా, నిస్సాన్ సగభాగం ఉత్పత్తిని తగ్గించుకుంది. మార్కెట్ షేర్ కోల్పోవడంతో రెండు కంపెనీలు ప్రొడక్షన్ కట్ చేసుకున్నాయని, ఈ మెర్జర్ తో ఏర్పడే కొత్త ఎంటిటీతో వ్యాపారంలో పురోభివృద్ది సాధించవచ్చని మెక్వేర్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జేమ్స్ హాంగ్  తెలిపారు. 

మెర్జర్ ఎలా ఉండబోతుంది.. 

హోండా, నిస్సాన్ కంపెనీలు రెండూ మెర్జర్ అయిన తర్వాత ఒక కొత్త కంపెనీగా ఏర్పడతాయని నిస్సాన్ సీఈఓ మకొటా ఉచిదా తెలిపారు. టోక్యో స్టాక్ ఎక్స్చేంజీలో కొత్త ఎంటిటిగా లిస్ట్ అవుతుందని తెలిపారు. కొత్త కంపెనీలో హోండా అధిక షేర్ హోల్డింగ్ కలిగి ఉంటుంది. రెండు కంపెనీలలో ఉన్న వనరులను వినియోగించుకొని కొత్త కంపెనీని లీడ్ పొజిషన్ లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రెండు కంపెనీల వద్ద ఉన్న ఉద్యోగులు, టెక్నాలజీని వినియోగించుకుని ఈవీ లాంటి కొత్త తరం వ్యాపారం రంగంలో దూసుకుపోనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.