సంక్రాంతి షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారా..? బంగారం ధర మళ్లీ పెరిగింది

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 16 నుంచి పెళ్లి బాజాలు కూడా బాగానే మోగనున్నాయి. సంక్రాంతికి తోడు పెళ్లిళ్లు కూడా మొదలవనుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధర కూడా రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.

ఇవాళ (గురువారం, జనవరి 9, 2025) హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 380 రూపాయలు పెరిగింది. దీంతో.. 10 గ్రాముల పసిడి ధర 79,200 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 350 రూపాయలు పెరిగి 72,600 రూపాయలుగా ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో కిలో వెండి ధర అక్షరాలా లక్ష రూపాయలు.

వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​రిపోర్ట్​ప్రకారం.. వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులే ఎక్కువ బంగారం కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు పెరుగుతున్నందున, సురక్షిత, నిలకడైన ఆస్తి కోసం ఇవి పసిడిని ఎంచుకున్నాయి. అమెరికా ఎన్నికల కారణంగా 2024, నవంబరులో బంగారం ధర తగ్గింది. అందుకే బ్యాంకులు విపరీతంగా కొనుగోళ్లు జరిపాయి. 

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు తగ్గే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. గత సంవత్సరం అంతలా కాకపోయినా 2025లో  బంగారం ధరలు మోస్తరుగా పెరుగుతాయని చెప్పారు. డొమెస్టిక్​ మార్కెట్లో ధరలు రూ.85 వేల వరకు వెళ్తాయని, డిమాండ్​ మరీ ఎక్కువైతే రూ.90 వేల మార్కుకు చేరుకుంటాయని చెప్పారు. వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు దూసుకెళ్లవచ్చని వివరించారు. 2025 మొదటి ఆరు నెలలలో బంగారానికి డిమాండ్​తక్కువే ఉండొచ్చనే అభిప్రాయం బులియన్ మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. బంగారం ధరలు వేగంగా పెరగకపోవచ్చనే వాదనలూ ఉన్నాయి.