ఆఫీసులో ఎంత సేపు పని చేయాలి.. ఆఫీస్.. ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ ఏంటీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలు ఎలా నష్టపోతున్నాయి.. ఇప్పుడు చేస్తున్న 8 గంటల వర్క్ టైం అనేది చాలా చాలా తక్కువా.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ ఇదే.. మొన్నటికి మొన్న ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణ పూర్తి అయితే 14 గంటలు పని చేయాలంటూ కామెంట్స్ చేస్తే.. ఇప్పుడు ఎల్ అండ్ టీ చైర్మన్ మరో అడుగు ముందుకేశారు.. ఇంట్లో పెళ్లాన్ని చూస్తూ ఎంతసేపు ఉంటారు.. ఆఫీసులకు వచ్చి పని చేయండి అంటూ ఘాటుగానే స్పందించారు. వర్క్ ఫ్రమ్ హోం అనేది లేదని ఈ లెవల్లో ఘాటుగా కామెంట్స్ చేసి సంచలనం రేపారు.
ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఆ మధ్య ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కామెంట్స్ చేస్తే .. అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలా మంది నుంచి విమర్శలు కూడా వచ్చాయి. పాశ్చాత్య దేశాలలో వారానికి 50 గంటలు పనిచేస్తుంటే మీరేంటి.. 70 గంటలు అంటారని చాలా మంది ప్రశ్నించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ స్పందిస్తూ.. వారానికి 70 గంటలు పనిచేస్తే.. నా భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని సెటైర్లు వేశారు.
తాజాగా L&T ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ అంతకంటే ఒక అడుగు ముందుకేసి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పనిచేయండి’’ అని కంపెనీ మీటింగ్ లో సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో ఈ మధ్య బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ | పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే 70 గంటల పని కూడా సరిపోదని, కనీసం 90 గంటలు పనిచేయాలని L&T ఛైర్మన్ అన్నారు. ఆదివారం కూడా పనిచేయాలా అని ఎంప్లాయ్స్ ప్రశ్నిస్తే.. ఆదివారాలు కూడా చేయాలని నేను అనను.. ఒకవేళ పనిచేస్తే చాలా సంతోషిస్తా. కానీ వారానికి 90 గంటలు పని చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది’’ అని ఆఫీస్ మీటింగ్ లో అన్నారు.
L&T ఛైర్మన్ వ్యాఖ్యలకు ఒక ఉద్యోగి ఘాటు రిప్లై ఇచ్చారు. దేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందా.. సెకండ్ ప్లేస్ లో ఉంటుందా నాకు అనవసరం.. నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. కుటుంబానికి దూరం కాదలచుకోలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నన్ను ఇష్టపడే వారికి నా అవసరం ఉంటుంది’’ అని రిప్లై ఇచ్చాడు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ.. నారాయణ మూర్తి 70 గంటలు అంటే.. సుబ్రహ్మణ్యన్ 90 గంటలు అంటున్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టవా.. ఎంత అహంకారం.. అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
ఆర్థికంగా దేశం ముందంజలో ఉండాలంటే ఎక్కువ సేపు పనిచేయడం తప్పదని వ్యాపార వేత్తలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో వర్క్ కల్చర్ మారిందని, అందరూ పని తక్కువ, లాభం ఎక్కవ రావాలని చూస్తున్నారని.. అందుకోసం వర్క్ కల్చర్ మారాలని కోరుతున్నారు. ఇదే జరిగితే ఎంప్లాయిస్ ఒత్తిడికి గురవ్వటం, అనారోగ్యం పాలు కావటం, తీవ్రమైన పని ఒత్తిడితో ఔట్ పుట్ రాదని మరికొందరు వాదిస్తున్నారు.