లాభాల వాటాలో అన్యాయం జరిగిందని సింగరేణి బొగ్గు గనులపై నిరసనలు

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు లాభాల చెల్లింపులో రాష్ట్ర సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తూ శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోని సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై సోమవారం మొదటి షిప్టు డ్యూటీ టైమ్​లో కార్మికులు నిరసనలు చేపట్టారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లీడర్లు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

సింగరేణి కంపెనీ ఆర్జించిన వాస్తవ లాభాలు రూ.4701 కోట్లపై కార్మికులకు 33శాతం వాటాగా రూ.1,550 కోట్లు చెల్లించాలని లీడర్లు డిమాండ్ చేశారు. వాటా చెల్లింపు నిర్ణయంపై రాష్ట్ర సర్కార్ పున:పరిశీలించాలన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు యూనియన్ ఆధ్వర్యంలో దశాల వారీ ఆందోళనలు చేపడుతామన్నారు. యూనియన్​ఏరియా, కేంద్ర, పిట్​కమిటీల లీడర్లు పాల్గొన్నారు.