దుర్గామాత గుడి తొలగించాలంటున్నారని...పెట్రోల్‌ బాటిళ్లతో మహిళల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు : దుర్గామాత గుడి తొలగించాలని ఆఫీసర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డు ప్రజలు ఆందోళనకు దిగారు. గురువారం పెట్రోల్‌ బాటిళ్లతో మున్సిపల్‌ ఆఫీస్‌ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 19వ వార్డు శ్రీనివాసనగర్‌, అబ్రహం నగర్‌ మధ్యలోని పార్క్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత గుడిని తొలగించాలని మున్సిపల్‌ ఆఫీసర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

ఎన్నో ఏండ్లుగా అక్కడే దుర్గామాతను ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నామని, మండపం ఉన్న స్థలంలోనే గుడి కడుతున్నామని, ప్రభుత్వ స్థలాన్ని అక్రమించుకోలేదని చెప్పారు. మహిళలు ఆందోళన చేస్తుండగా అక్కడికి వచ్చిన సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్యకు సమస్యను వివరించడంతో ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణతో మాట్లాడి, మహిళలకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ఈ విషయమై క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పార్క్‌ ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భారీ నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కాలనీవాసులకు చెప్పామన్నారు.