బావిలో దూకి కూతురు ఆత్మహత్య కాపాడబోయిన తండ్రి మృతి

  • సిద్దిపేట జిల్లా మక్తమాసాన్​పల్లిలో విషాదం

గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్​పల్లిలో తండ్రి తిట్టాడని మనస్తాపంతో ఓ కూతురు బావిలోకి దూకి చనిపోగా, ఆమెను కాపాడడానికి దూకిన తండ్రి కూడా చనిపోయాడు. బేగంపేట ఎస్సై భువనేశ్వర్​రావు కథనం ప్రకారం..మక్తమాసాన్​పల్లి కాశగుడిసెలలో ఉండే షేక్​ సిరాజ్​(46) తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు ఆదివారం రాత్రి కూడా తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండగా చిన్నకూతురు రోషన్ (16) అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

దీంతో నన్నే అడ్డుకుంటావా అంటూ కూతురిని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రోషన్​ బయటకు పరిగెత్తి సమీపంలోని బావిలో దూకింది.  ఇది చూసిన తండ్రి సిరాజ్​ ఆమెను కాపాడడానికి బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. ఇరుగు పొరుగు వారు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.