తల్లికి రోగం వచ్చిందని తలను నేలకేసి బాది చంపిండు

గజ్వేల్​(వర్గల్​), వెలుగు: దైవ దర్శనానికి వచ్చి అస్వస్థతకు గురైన తల్లిని అసహనంతో తలను నేలకు బాది చంపాడో కొడుకు. తర్వాత ఆమెది సహజ మరణంగా చిత్రించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్​మండలం నాచారంగుట్ట క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గౌరారం ఎస్సై శివకుమార్​ కథనం ప్రకారం..హైదరాబాద్ కుత్భుల్లాపూర్​ ఇందిరానగర్​లో  ఉండే గాలిగామ బాలకృష్ణమ్మ(54) ఖైరతాబాద్​లోని డైరక్టరేట్​ఆఫ్​ఎకనామిక్స్​ప్లానింగ్​డిపార్ట్​మెంట్ లో అటెండర్.

 బుధవారం ఆమె కొడుకు సర్వేశ్​తో పాటు పక్కింటి వారితో కలిసి ఆటోలో నాచగిరి క్షేత్రానికి వచ్చింది. దర్శనం తర్వాత రాత్రి అందరూ కలిసి ఓ సత్రంలో బస చేశారు. రాత్రివేళ బాలకృష్ణమ్మ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. దీంతో కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి బాదడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇది చూసిన పక్కింటి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తర్వాత సర్వేశ్​తన తల్లి అస్వస్థతకు గురై చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి బిడ్డ సుజాత సంఘటనా స్థలానికి వచ్చి అనుమానంతో పక్కింటి వారికి ఫోన్​ చేసి అడగ్గా వారు అసలు విషయం చెప్పారు. దీంతో ఆమె తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.