- ప్రాణాలకు తెగించి 3 గంటల్లోనే పునరుద్ధరించిన సిబ్బంది
కుభీర్, వెలుగు: గడ్డెన్న ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వాగుపై నిగ్వ నుంచి మొలా గ్రామానికి వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్ వైర్లు ఆదివారం తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వాగులో మూడు గంటల పాటు కష్టపడి విద్యుత్ లైన్ ను పునరుద్ధరించారు. గోడాపూర్ నుంచి గడ్డెన్న బ్యాక్ వాటర్ వాగుపై నుంచి మొలా గ్రామానికి వస్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ తో నిత్యం సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఆదివారం వైర్లు తెగి పడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిత్యం సమస్యలు సృష్టిస్తున్న ఈ లైన్ ను మాలేగాం రోడ్డు గుండా వేస్తే సమస్యలు ఉండవని స్థానికులు చెబుతున్నారు. వాగులో ఈత కొడుతూ సాహసోపేతంగా విద్యుత్ లైన్ను సరిచేసిన ఎల్ఎం యాసిన్, ఏఎల్ఎం యోగేశ్వర్, హనుమాన్లును ఇరు గ్రామాల ప్రజలు అభినందించారు.