మెదక్​ జిల్లాలో గాలివాన బీభత్సం

కౌడిపల్లి, వెలుగు: మెదక్​జిల్లా కౌడిపల్లి మండల పరిధి తునికి గ్రామ సమీపంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆలయం వద్ద  ఉన్న ఏడు ప్రైవేటు సత్రాల రేకులు, ఇనుప పట్టీలు, సిమెంటు స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఎండోమెంట్​కు చెందిన ప్రసాదాలు తయారుచేసే రూమ్​ రేకులు దెబ్బతిన్నాయి.  

జోరు వానకు సత్రాలు ధ్వంసం కావడంతో అందులో బస చేసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. రేకులు ఎగిరి పడడంతో అందులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న కరెంటు స్తంభాలు కూలిపోయి 11 కేవీ లైన్ కింద పడడంతో మూడు గంటల పాటు కరెంట్ లేకుండా పోయింది. దీంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి వేళ ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేక వర్షంలో తడుస్తూ అక్కడే ఉండిపోయారు. చెట్ల కింద ఉన్న పలువురిపై కొమ్మలు విరిగి పడి గాయాలయ్యాయి. గాలి వాన  బీభత్సం వల్ల సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని ఈవో మోహన్​ రెడ్డి తెలిపారు.  

ఈదురు గాలులకు పౌల్ట్రీ ఫాం రేకులు ధ్వంసం 

శివ్వంపేట: మెదక్​జిల్లా శివ్వంపేట మండలం టిక్యా దేవమ్మగూడ తండాకు చెందిన ధనరాజ్ ఇటీవలే రూ.14 లక్షలు ఖర్చుచేసి ఆరు వేల కోళ్ల కెపాసిటీతో పౌల్ట్రీ ఫామ్ నిర్మించుకున్నాడు. ఆదివారం రాత్రి భారీ ఈదురుగాలులు వీయడంతో పౌల్ట్రీ ఫామ్ రేకులు ధ్వంసమయ్యాయి.  తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

పిడుగులు పడి..

పాల్వంచ రూరల్/ సుజాతనగర్​ : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని రేగులగూడెం పంచాయతీలో పిడుగు పడి పశువులు చనిపోయాయి. రాళ్లచెలకకు చెందిన రైతులు లక్కమడుగు జోగా, పద్దం పాకలో పశువులపై పిడుగు పడడంతో 10 పశువులు అక్కడికక్కడే చనిపోయాయి. ఇదే జిల్లా సుజాతనగర్​ మండలం ఉప్పరిగూడెంలో మలోతు లక్ష్మణ్ పూరింటిపై పిడుగుపడి ఇంట్లో సామగ్రి కాలిపోయింది. రూ.3 లక్షల 75 వేల ఆస్తి నష్టం జరిగిందని ఆర్​ఐ బాబు తెలిపారు. తక్షణ సాయంగా 20 కిలోల బియ్యాన్ని అందజేశారు.