ఎన్నికల వేళ.. గాలి , వాన బీభత్సం... కూలిన టెంట్లు..

ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.  సందట్లో సడేమియా అంటూ.. వరుణ దేవుడు.. వాయుదేవుడు కూడా వారివారి ప్రతాపాలను చూపించారు.   తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తుండగా గాలిదుమారం వచ్చి.. టెంట్లు కూలిపోయాయి.  పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని సమాచారం అందుతోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని  కాటారం,మహాదేవపూర్ మండలాల్లో  వర్షం కురవడంతో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు.  వార్త రాసే సమయానికి కోరుట్ల ప్రాంతంలో గాలి దుమారం రేగి.. ఆకాశం మేఘావంతమైంది.  కోరుట్ల పట్టణంలో  154 వ పోలింగ్​ స్టేషన్​ వద్ద ఏర్పాటు చేసిన టెంట్​ గాలి దుమారానికి కూలిపోయింది. 

ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తుంది.  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు తడి ముద్దయ్యాయి.  టెంట్​ లోకి భారీగా వరద నీరు చేరడంతో ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.  ఈవీఎంలు తడిచిపోయాయి.  ఈ క్రమంలో రేపు ( మే 13) ఈవీఎంలు ఎంతమాత్రం పనిచేస్తాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని పసలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ లో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ వద్ద  టెంట్లు కుప్ప కూలాయి.  అలాగే 25 వ నెంబర్ రహదారిలో పెద్ద పెద్ద చెట్లు కూలడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఆదివారం ( మే 12)  సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పోలింగ్​ కేంద్రాల వద్ద చెట్లు కూలిపోయాయి.  మద్దూరు-ముస్త్యాల రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గాగిళ్లాపూర్‌లో స్తంభం విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కొండపాక మండలం వ్యాప్తంగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గాలులకు చాలా చోట్ల ఫ్లెక్సీలు నెలకొరిగాయి. పోలింగ్​ కేంద్రాలకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.