వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..భర్త గొంతు నులిమిన భార్య

  • మాట పడిపోవడంతో  చెప్పలేకపోయిన భర్త 
  • చికిత్స పొందుతూ మృతి
  • గట్టిగా అడగడంతో ఒప్పుకున్న భార్య 
  • ఆసిఫాబాద్​ జిల్లా  దహెగాంలో ఘటన

దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా దహెగాం మండలంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భర్తను చంపేసింది. దీనికి దహెగాం సీఐ అల్లం రాంబాబు కథనం ప్రకారం...మండల కేంద్రానికి చెందిన బండ మల్లేశ్(33)కు ఎల్లూర్ కు చెందిన సుజాత అలియాస్ మంజుల(30)తో 13 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి 11 ఏండ్ల పాప ఉంది. ఆరేండ్ల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు(23)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడాది కింద మల్లేశ్ కు తెలియడంతో అతడిని సంసారానికి పనికి రాకుండా చేయాలని ఇద్దరూ కలిసి మల్లేశ్​వృషణాలపై తీవ్రంగా కొట్టారు.

 అప్పుడు బయటపడిన మల్లేశ్..​భార్యతో ఉంటే తనను చంపేస్తుందని పెద్దలకు చెప్పి దూరంగా ఉంటున్నాడు. 4 నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు ఇద్దరితో మాట్లాడి మళ్లీ ఒక్కటి చేశారు. అయినా, సుజాత తీరులో మార్పు రాలేదు. అతడికి తిండి పెట్టకపోవడంతో నీరసించిపోయాడు. మల్లేశ్​అనారోగ్యంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుండడంతో సుజాత, రాజు కలిసి ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. 

ఈ నెల 25న మల్లేశ్ పడుకోగా గొంతు నులిమడంతో స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన మల్లేశ్ అన్న, సోదరి అతడి పరిస్థితిని గమనించి కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ మల్లేశ్​మాట పడిపోయి భార్య హత్యాయత్నం గురించి చెప్పలేకపోయాడు. అయితే సైగల ద్వారా ఏదో చెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ వైద్యం అందించి ఇంటికి తీసుకువచ్చాక 28న మల్లేశ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. మంచిర్యాల హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

 అయితే, సుజాత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు, మల్లేశ్​భార్య గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడని గుర్తుకు వచ్చి ఆమెను నిలదీశారు. దీంతో తానే గొంతు నులిమానని నిజం ఒప్పుకుంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుజాత, రాజును అరెస్ట్​చేసి రిమాండ్ కు తరలించారు. ప్రెస్ మీట్ లో ఎస్సై కందూరి రాజు ఉన్నారు.