ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలు సీజ్ చేసిన ఆస్తులను ఏం చేస్తారు?

అవినీతి ఆరోపణలతో అధికారులు, సంస్థలపై దాడులు జరిపినపుడు .. లక్షల నుంచి కోట్ల రూపాయలు.. కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడుతుంటాయి కదా. వాటిని ప్రభుత్వం ఏం చేస్తుంది అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా..? ఎవరికైనా రావాల్సిందే. ఎందుకంటే పట్టబడిన ధనం తర్వాత ఏమయిపోతుందో.. ఏం చేశారో.. ఎవ్వరికీ తెలియదు. 

 ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఆదాయపు పన్ను శాఖ (Income Tax Dept) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చట్టపరమైన విచారణల సమయంలో నగదు, బంగారం, వాహనాలువంటి ఆస్తులను తరచుగా జప్తు చేస్తుంటాయి. వాటి నిర్వహన గురించి చెప్పాలని లోక్ సభ సభ్యుడు పర్షోత్తంభాయ్ రూపాలా అడిగిన ప్రశ్నకు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం  స్వాధీనం చేసుకున్న కొన్ని రకాల ఆస్తులను పారవేసే అవకాశం ఉందన్నారు.

ALSO READ | KVP: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. రూ. 5 లక్షలకు 10 లక్షలు.. రెట్టింపు రాబడినిచ్చే ప్రభుత్వ పథకం

మనీ-లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కొన్ని రకాల వస్తువులు, ఆస్తులు సహజంగా క్షీణంచే వరకు వదిలేసేలా చట్టం ఉందని, ఒక వేళ నిర్వహణ ఖర్చులు ఆ ఆస్తుల విలువను మించి పెరిగితే ఆ చరాస్తులను పారవేయడానికి సదుపాయం ఉందని పేర్కొన్నారు. 

అదేవిధంగా కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110(1A) ప్రకారం, పాడైపోయే లేదా ప్రమాదకరమైన వస్తువులు లేదా కాలక్రమేణా విలువ తగ్గే వస్తువులను తక్షణమే పారవేసేందుకు ప్రభుత్వం అధికారం ఇస్తుందని అన్నారు. బంగారం, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రానిక్ వస్తువులు,  మద్యం వంటి నోటిఫైడ్ వస్తువులు ఈ జాబితాలోకి వస్తాయి. 

కస్టమ్స్, నార్కోటిక్స్ నిబంధనలు

మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాలు, NDPS చట్టంలోని సెక్షన్ 52(A) ప్రకారం కొన్ని నిల్వ ఉంచడం వలన ప్రమాదకరంగా మారే వస్తువులను ముందస్తుగా పారవేయాల్సి ఉంటుందని తెలిపారు. 

ఆదాయపు పన్ను శాఖ విధానం

ఆదాయపు పన్ను చట్టం, 1961 రెండవ షెడ్యూల్ ప్రకారం రికవరీ కావాల్సిన ఆదాయానికి అనుగుణంగా స్వాధీనం చేసుకున్న ఆస్తులను అటాచ్ చేసే సదుపాయం ఉందని తెలిపారు. అందుకోసం స్వాధీనం చేసుకున్న ఆస్తులను అటాచ్‌ చేయడం, విక్రయించడం ద్వారా పన్ను బకాయిల రికవరీ కోసం వినియోగిస్తామని తెలిపారు. కొన్ని సందర్భాలలో పాడైపోయే వస్తువులు సీజ్ చేయరు.  వాటిని పారవేయడం లేదా నిర్వీర్యం చేయడం జరుగుతుందని అన్నారు. 

అయితే చట్ట ప్రకారం ఏవైనా ఆస్తులను సీజ్ చేసినపుడు.. దానికి సంబంధించిన ఇతర వాటాదారులను దృష్టిలో ఉంచుకొని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు వాటిని సమర్ధవంతంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పేచీలలో ఉన్న ఆస్థుల విషయంలో ఇతర వాటా దారులను దృష్టిలో ఉంచుకొని రికవరీ చేయడం జరుగుతుందని, స్వాధీనం చేసుకున్న ఆస్తులను విచారణ ముగిసిన ముగిసే వరకు భద్ర పరచాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు.