అల్లాపూర్​ గురుకులంలో ఏమైంది? బిల్డింగ్​పై నుంచి పడిన స్టూడెంట్​

  •     తీవ్ర గాయాలతో దవాఖానకు...
  •     తోసేశారంటున్న విద్యార్థి
  •     సూసైడ్​ అటెంప్ట్​ : ప్రిన్సిపాల్​
  •     తమ బిడ్డ ఆ పని చేయదన్న పేరెంట్స్​
  •     ఘటనపై అన్నీ అనుమానాలే...

రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండ‌లం అల్లాపూర్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​లోని హాస్టల్ బిల్డింగ్ రెండో అంత‌స్తు నుంచి సోమవారం ఎస్సెస్సీ స్టూడెంట్ మల్లీశ్వరి (15) కింద పడి తీవ్రంగా గాయ‌ప‌డింది. అయితే, తనను ఎవరో తోసేశారని మల్లీశ్వరి చెప్తుండగా, సూసైడ్ చేసుకోవాలని దూకిందని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇదే మండ‌లం యూసుఫ్ గ్రామానికి చెందిన బేగ‌రి కుమార్ బిడ్డ  బేగ‌రి మల్లీశ్వరి గురుకుల స్కూల్​లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఉద‌యం 7గంట‌లకు హాస్టల్ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి మ‌ల్లిశ్వరి కింద ప‌డిపోయింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను తోటి స్టూడెంట్స్ గుర్తించి ప్రిన్సిపాల్ కు స‌మాచారమివ్వగా జ‌హీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు.  ప‌రిస్థితి విష‌మంగా ఉండడంతో సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. ఆమె బ్యాక్ బోన్, కుడికాలు, ప‌క్కటెముక‌లు విరిగిన‌ట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కలెక్టర్​వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం నిమ్స్​దవాఖానకు తరలించారు. పోలీసులు, త‌హసీల్దార్ ఘ‌ట‌నా స్థలానికి వెళ్లి ప‌రిశీలించారు. స్టూడెంట్ మల్లీశ్వరి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

కాళ్లు ప‌ట్టి తోసేశారు..

ఘటనపై మల్లీశ్వరి మాట్లాడుతూ ‘ నేను ఆరో తరగతి స్టూడెంట్​తో కలిసి మార్నింగ్​ ఏడు గంటలకు హాస్టల్ బిల్డింగ్ రెండో అంతస్తుకు వెళ్లా.  నాతో ఉన్న స్టూడెంట్​ గ‌దిలోకి వెళ్లింది. వ‌రండాలోని సైడ్ వాల్ ఎత్తుగా ఉండ‌డంతో బ‌కెట్ వేసుకొని దానిపై నిల‌బ‌డి వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్నా. అప్పుడే ఎవ‌రో నా కాళ్లు ప‌ట్టి కిందకు తోసేశారు. దీంతో సైడ్ వాల్ అంచును ప‌ట్టుకొని10 నిమిషాలు వేలాడా..

పట్టు దొరక్కపోవడంతో కింద పడ్డా’ అని చెప్పింది. మల్లీశ్వరి త‌ల్లిదండ్రులు కూడా త‌మ కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాద‌ని, ఎవ‌రో కావాల‌నే తోసేశార‌ని ఆరోపిస్తున్నారు.  ప్రిన్సిపాల్ ​మాట్లాడుతూ మల్లీశ్వరి మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చని అన్నారు.