ఆదిలాబాద్‌‌‌‌ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌లో వీఆర్‌‌‌‌ఏ ఆత్మహత్యాయత్నం

  • సర్వీస్ బుక్‌‌‌‌లో డీఏవో సంతకం చేయడం లేదంటూ ఆవేదన

ఆదిలాబాద్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : తన సర్వీస్‌‌‌‌ బుక్‌‌‌‌లో డీఏవో సంతకం చేయడం లేదంటూ ఓ వీఆర్‌‌‌‌ఏ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌ పట్టణంలో మంగళవారం జరిగింది. నిర్మల్‌‌‌‌ జిల్లా ఖానాపూర్‌‌‌‌లో వీఆర్ఏగా పనిచేసిన అభిషేక్‌‌‌‌ 2021లో ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడడంతో అప్పటి నుంచి సస్పెన్షన్‌‌‌‌లో ఉన్నాడు. ఉద్యోగంలో చేరేందుకు ఇటీవల ఏసీబీ నుంచి క్లియరెన్స్‌‌‌‌ వచ్చింది. దీంతో ఉద్యోగంలో చేరేందుకు తన సర్వీస్ బుక్‌‌‌‌ తీసుకొని సంతకం కోసం అప్పట్లో తహసీల్దార్‌‌‌‌గా పనిచేసిన, ప్రస్తుతం ఆదిలాబాద్‌‌‌‌ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌లో డీఏవోగా పనిచేస్తున్న నరేందర్‌‌‌‌ వద్దకు వచ్చాడు.

ఆయన సంతకం చేయకపోవడంతో మనస్తాపానికి గురైన అభిషేక్‌‌‌‌ అక్కడే పురుగుల మందుతాగాడు. గమనించిన ఆఫీస్‌‌‌‌ సిబ్బంది అభిషేక్‌‌‌‌ను రిమ్స్‌‌‌‌కు తరలించారు. ఈ విషయంపై డీఏవో నరేందర్‌‌‌‌ను వివరణ కోరగా.. అభిషేక్‌‌‌‌ సంతకం కోసం తన వద్దకు వచ్చాడని, కానీ తాను జిల్లా మారానని, సొంత జిల్లా అధికారితో సంతకం చేయించుకోవాలని సూచించడంతో అభిషేక్‌‌‌‌ ఆత్మహత్యకు యత్నించాడన్నారు. అభిషేక్‌‌‌‌ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.