అధికారం దుర్వినియోగం చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తరు : వివేక్‌ వెంకటస్వామి

  •    తెలంగాణలో కేసీఆర్‌‌కు, ఏపీలో జగన్‌కు జరిగిందిదే 
  •     ఏ పొజిషన్‌లో ఉన్నా ప్రజలకు సహాయ పడాలని కాకా నేర్పాడు
  •     అంబేద్కర్‌‌ కాలేజీల్లో రూ.40 లక్షల నుంచి 50 లక్షలు ఫీజు రీయింబర్స్​మెంట్‌ ఇస్తున్నామని వెల్లడి
  •     వివేక్‌, వంశీకృష్ణను సన్మానించిన భీమ్ సైనిక్ ఫౌండేషన్, గోసంగి కుల సంఘం, స్టాంప్ వెండర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మంచి చేయడానికే పొజిషన్‌లోకి రావాలని, వచ్చాక ఆ పొజిషన్‌ను దుర్వినియోగం చేయకూడదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చాలా మంది మంచి పొజిషన్‌లోకి వచ్చాక ప్రజలను మర్చిపోతారని, కానీ ఏ స్థాయిలో ఉన్నా ప్రజలకు సహాయ పడాలని గుణం తన తండ్రి కాకా వెంకటస్వామి తమకు నేర్పారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారని, అందుకే తెలంగాణలో కేసీఆర్‌‌ను, ఏపీలో జగన్ మోహన్‌  రెడ్డిని ఓడగొట్టారని తెలిపారు.

కేంద్రంలో ప్రధాని మోదీకి కూడా ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందిన వివేక్‌ వెంకటస్వామి, వంశీకృష్ణను ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో భీమ్ సైనిక్ ఫౌండేషన్, గోసంగి కుల సంఘం, స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ సంయుక్తంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూల్పగిరి మహేశ్వర్ రాజ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కప్ప కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అంబేద్కర్, కాకా చిత్రపటాలకు నివాళి అర్పించారు. అనంతరం చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు బాగా చదువుకొని, మంచి పొజిషన్‌కు చేరి, పది మందికి సహాయపడాలని వివేక్ ఆకాంక్షించారు. విద్యతోనే పది మందికి సహాయం చేయగలమని, దళితులు ఎదగాలని ఆనాడు బీఆర్‌‌ అంబేద్కర్ అందరితో కొట్లాడి రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. అలాంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని, పది మందికి సహాయ పడాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు చదువుకోవడం కోసం కాకా వెంకటస్వామి అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారని వివేక్ తెలిపారు. ప్రస్తుతం ఈ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్​మెంట్ ఇస్తున్నామని తెలిపారు.

అంబేద్కర్ కాలేజీలో చదివిన పిల్లలకు 75 శాతం మార్కులొస్తే.. వారికి ఫీజు రీయింబర్స్​మెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. ఫస్టియర్‌‌ ‌ ‌ ‌ రూ.10 లక్షలు, సెకండియర్‌‌ రూ.20 లక్షలు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50 లక్షల దాకా పీజు రీయింబర్స్‌మెంట్ చేయబోతున్నామని ఆయన తెలిపారు. అంబేద్కర్ లా కాలేజీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు తమ కాలేజీ కృషి చేస్తుందని చెప్పారు. 

వివేక్‌ను కేబినెట్‌లో తీసుకోవాలి..

దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అని, ఇక్కడ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలలో నిరక్ష్యరాస్యులు ఉంటారని మహేశ్వర్ రాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేబినెట్‌లో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి స్థానం కల్పించలేదని గుర్తుచేశారు. ఈ జిల్లాపై వివేక్‌ వెంకటస్వామి, గడ్డం వినోద్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ క్రమంలో వివేక్‌కు కేబినెట్‌లోకి స్థానం కల్పించాలని ఆయన కోరారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేత గోషిక రాజేశం.. వివేక్, వంశీకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి సత్యనారాయణ, కాన్ఫెడరేషన్ సంస్థ సభ్యుడు మహేశ్‌, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎంఏ సిద్ధిఖీ, అడ్వకేట్ ప్రమీల, ఎస్ఎస్ ఈకో మోటార్స్ సీఎండీ సంగీత, స్టాంప్ వెండర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ రాజన్ కుమార్, గోసంగి సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ములుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ స్థాయికి రావడానికి కాకా, వివేక్‌ కారణం: వంశీ కృష్ణ

గత పదేండ్లు వివేక్‌ వెంకటస్వామికి పదవి లేకున్నా ప్రజా సేవలోనే ఉన్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గుర్తుచేశారు. పేద, బలహీన వర్గాల కోసం ఆయన పనిచేశారని, దీనికి కాకా ఆలోచన విధానమే కారణమన్నారు. కాకా ఎక్కువగా చదువుకోలేదని, అయినా.. చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని భావించి అంబేద్కర్‌‌ కాలేజీని స్థాపించారని తెలిపారు. 

కాలేజీ స్థాపించి ఈ 50 ఏండ్లలో ఎంతో మంది బడుగు బలహీన, వెనకబడిన వర్గాల పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. ఎంపీగా గెలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ స్థాయికి రావడానికి తన తాత కాకా వెంటకస్వామి, తండ్రి వివేక్ ఆశీస్సులే కారణమన్నారు. అందరి సహకారంతో పెద్దపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు.