బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల–కోణంపేట రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఉన్నప్పటికీ అధికారులు పనులు నిలిపివేశారని గ్రామస్తులు మండిపడ్డారు. రోడ్డు పనులకు అడ్డు చెప్పవద్దంటూ కోనంపేట గ్రామస్తులు నెన్నెల రేంజ్కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. కలెక్టర్, డీఎఫ్‌వో వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ 3 గంటల పాటు బైఠాయించారు. నెన్నెల రేంజ్ఆఫీసర్అందుబాటులో లేకపోవడంతో రెబ్బెన సెక్షన్ ఆఫీసర్బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
గ్రామస్తులు మాట్లాడుతూ.. 25 ఏండ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని, అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రాలేదని దుస్థితి ఉందన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేయొద్దని అటవీ శాఖ అధికారులు పనులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని..
రిజర్వు ఫారెస్ట్‌లో సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్‌శాఖకు అనుమతులు ఉన్నాయని, పర్మిషన్ పొందిన పీఆర్ సంస్థ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఐటీడీఏ పనులు చేపడుతుండడంతో నిలిపివేశామని సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపారు. ఐటీడీఏ పేరిట అనుమతులు తెచ్చుకొని పనులు కొనసాగించాలని సూచించారు.