- విధులకు హాజరుకావడం లేదని సబ్ సెంటర్కు తాళం
బెల్లంపల్లి రూరల్, వెలుగు : గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కోణంపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని సోమవారం హెల్త్సబ్ సెంటర్కు తాళం వేసి నిరసన తెలిపారు. గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని ముందస్తుగా హెచ్చరించినా అధికారులు స్పందించలేదని మండిపడ్డారు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు సబ్సెంటర్కు తాళం వేశారు. అలాగే స్థానిక అంగన్వాడీ సెంటర్ను ఇంటిలోనే నిర్వహిస్తున్నారని పాఠశాలలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ పక్కా భవనంలో కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రభుత్వ బడిలో కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించారు. స్థానిక స్కూల్లో ఇబ్బందులు,రోడ్లు తదితర సమస్యలను లేవనెత్తారు. ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేకపోతే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.