ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని మెదక్‌‌‌‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి కూడా నిందితుడేనని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా ఆయనను ప్రశ్నించాలన్నారు. 

ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నప్పటికీ అరెస్టు చేయకపోవడం ఏంటన్నారు. బై ఎలక్షన్స్‌‌‌‌ సమయంలో డబ్బుల రవాణా కోసం ఎస్​ఐ సాయికిరణ్‌‌‌‌ను వెంకట్రామిరెడ్డి నియమించుకున్నట్టు చెప్పారు. ఇదంతా మార్చి 29న రాధాకిషన్‌‌‌‌రావు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో తేలిందన్నారు. వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకే రాధాకిషన్‌‌‌‌రావు, ఎస్‌‌‌‌ఐ సాయికిరణ్‌‌‌‌ డబ్బులు తరలించారని తెలిపారు. డీజీపీకి అన్ని ఆధారాలు ఇచ్చినట్టు చెప్పారు.