ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న వెల్మకన్న గ్రామస్తులు

  • జేసీబీని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ సిబ్బంది

కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ భూమి కబ్జాను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మెదక్​జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నలో శుక్రవారం జరిగింది. వెల్మకన్న గ్రామ శివారులోని దేవుడికుంట సమీపంలో బొడ్ల సురేశ్ తన పొలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నట్టు గ్రామస్తులకు తెలిసింది. జేసీబీతో భూమి చదును చేస్తుండగా గ్రామస్తులు వెళ్లి కబ్జా చేస్తున్న వ్యక్తిని నిలదీశారు. జేసీబీని గ్రామంలోని ముదిరాజ్ భవనం వద్దకు తీసుకువచ్చి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.  

రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. తర్వాత జేసీబీని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ ఆఫీస్​కు తీసుకువచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ విషయమై తహసీల్దార్ ఆంజనేయులును వివరణ కోరగా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే గ్రామస్తుల ఫిర్యాదుతో స్థలాన్ని పరిశీలించి జేసీబీని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసి మొక్కలు తొలగించిన స్థలంలోనే మొక్కలు నాటేల చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను గ్రామస్తులు కోరారు