మొత్తం ఉద్యోగులు 110: మీటింగ్‌కు రాలేదని 99 మందిని తొలగించిన కంపెనీ

ఏ కంపెనీ బాసైనా మీటింగ్‌కు హాజరు కాకపోతే, ఉద్యోగులను మందలిస్తారు లేదా వారిపై ఒకట్రెండు రోజులు కస్సు బస్సు అంటారు. ఇదే కదా జరిగేది. కానీ, అమెరికాలో ఓ సంగీత వాయిద్యాల కంపెనీ సీఈఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్‌కు హాజరు కాలేదన్న కోపంతో సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించారు. 

సదరు గొప్ప సీఈఓ పేరు.. బాల్డ్విన్(Baldvin). మీటింగ్‌కు హాజరు కావడంలో విఫలమయ్యారన్న ఒకే ఒక కారణంతో 99 మంది ఉద్యోగులను తొలగించారు. పోనీ, ఆయన సీఈఓగా ఉన్న కంపెనీలో వేలల్లో ఉద్యోగులు ఉన్నారా..! అదీ లేదు. సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మాత్రమే.

ALSO READ | బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!

తొలగింపు ప్రకటనలో బాల్డ్విన్.. ఉద్యోగులు వారి విధుల పట్ల బాధ్యతగా లేకపోవడాన్ని హైలైట్ చేశారు. 110 మందిలో 99 మంది డుమ్మా కొట్టారంటే, పనిచేస్తున్న సంస్థ పట్ల  వారికున్న అంకితభావం ఏంటో తెలుస్తోందని అన్నారు.

"ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయడంలో, సమావేశాలకు హాజరు కావడంలో మీరు విఫలమయ్యారు. అందువల్ల, నేను మన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. మీ ఆధీనంలో ఉన్న కంపెనీ ప్రాపర్టీని తిరిగి ఇవ్వండి. అన్ని ఖాతాల నుండి సైన్ అవుట్ చేయడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నా.." అని బాల్డ్విన్ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశారు. ఈ తొలగింపు నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.