- రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తం
- అయోధ్యలో గుడి కట్టి.. దేశమంతా ‘జై శ్రీరామ్’ అనిపించిన ఘనత మోదీదే
- దేశంలో 400 పైగా సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా
- సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగం
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ‘‘అవినీతి, అక్రమాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. అందుకే కాళేశ్వరం అవినీతి, భూ దందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టడం లేదు” అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చీరాగానే కాంగ్రెస్ పార్టీ అవినీతిని మొదలుపెట్టిందని, తక్కువ టైమ్‌లోనే తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా తయారు చేసిందని ఆరోపించారు.
గురువారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ విశాల జన సభలో అమిత్ షా మాట్లాడారు. మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని, ఒక్క బీజేపీ మాత్రమే నిర్వహిస్తున్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తోనే తెలంగాణ సమగ్ర వికాసం సాధ్యమని చెప్పారు.
‘‘తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటి స్పష్టంగా చెప్పదలచుకున్న. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి జరిగేలా చూసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది’’ అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు ఇవ్వండి
బీజేపీ ఈసారి 400 సీట్లు గెలుచుకుంటుందని, నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. మెదక్‌లో రఘునందన్ రావును భారీ మోజార్టీతో గెలిపించాలని అన్నారు. ‘‘అయోధ్య కేసును ఐదేండ్లలోనే గెలిచి, మందిర నిర్మాణం పూర్తిచేసి, రామ్‌లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసి, దేశమంతా జై శ్రీరామ్ నినాదాన్ని వ్యాపింపజేసిన ఘనత మోదీకి దక్కుతుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగరాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ కోరుకున్నాయి” అని వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, జమ్మూకాశ్మీర్ భారతదేశ అంతర్భాగమని చాటిచెప్పామని అమిత్‌షా అన్నారు. అనంతరం మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ.. మెదక్‌లో తనను ఓడించడానికి రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ‘‘నయవంచనకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. అధికారం చేపట్టి నాలుగు నెలలు గడిచినా రైతు రుణమాఫీ, ఇతర హామీలు అమలు చేయకుండా మోసగించింది” అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు భూ సేకరణ పేరిట ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని ఆయన అన్నారు. సభలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొప్పు భాష, ఆకుల విజయ, ప్రేమేందర్ రెడ్డి, జి.మోహన్ రెడ్డి, జి.శ్రీనివాస్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
2 గంటలు ఆలస్యం... 8 నిమిషాల ప్రసంగం
సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభకు అమిత్ షా 2 గంటలు ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన ఆయన 2 గంటలకు సభా స్థలికి చేరుకున్నారు. రావడం ఆలస్యమైందని, ఎండ బాగా ఉన్నందున తాను ప్రసంగానికి ఎక్కువ సమయం తీసుకోనంటూ అమిత్ షా స్పీచ్ మొదలు పెట్టారు. తనకు తెలుగు రానందున క్షమించాలని కోరుతూ 8 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో కొందరు.. సహారా ఇండియా పేమెంట్స్ జరిగేలా చూడాలని, ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.