దివ్యాంగులకు చేయూత .. బడ్జెట్​లో రూ.1,225 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ:  కేంద్రం దివ్యాంగుల సాధికారత విభాగానికి  బడ్జెట్​లో రూ.1,225.27 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్​తో (రూ.1,225.01కోట్లు) పోల్చితే కేవలం 0.02 శాతం నిధులనే పెంచింది. వివిధ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో కీలక కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. దివ్యాంగుల సంక్షేమ పథకాలకు 2023–-24లో రూ.502 కోట్లు  కేటాయించగా.. ఈసారి రూ.615.33 కోట్లు కేటాయించింది. 

దివ్యాంగుల ఉపకరణాల కొనుగోలు/ఫిట్టింగ్ ఫండ్స్​ను రూ.305 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెంచింది. దీనదయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం నిధులను రూ.130 కోట్ల నుంచి రూ.165 కోట్లకు పెంచింది. అదనంగా, దివ్యాంగుల చట్టం అమలు పథకానికి రూ.135 కోట్లు కేటాయించింది. దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ నిధులను కేంద్రం ఈసారి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.155 కోట్లు కేటాయించగా.. ఈ సారి కేవలం రూ.142.68 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే, సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ నిధులను కూడా రూ.76 కోట్ల నుంచి రూ.25 కోట్లకు తగ్గించింది.