రాష్ట్రం పేరు చెప్పకుంటే.. నిధులు ఇవ్వనట్టా?

  • బడ్జెట్​లో అన్ని రాష్ట్రాలకూ నిధులు కేటాయించాం: నిర్మలా సీతారామన్ 
  • తెలంగాణకు బడ్జెట్​లో వేల కోట్లు ఇచ్చామని వెల్లడి

న్యూఢిల్లీ:  కేంద్ర బడ్జెట్​లో ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని రాష్ట్రాలకూ నిధులు కేటాయించామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం పేరు చెప్పనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వనట్టు కాదన్నారు. దీనిపై ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. 

మంగళవారం లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా  ఆమె  సమాధానమిచ్చారు.  ‘‘యూపీఏ హయాంలో 2004–2005 బడ్జెట్ స్పీచ్​లో 17 రాష్ట్రాల పేర్లను చెప్పలేదు. అంటే ఆ 17 రాష్ట్రాలకు ఆ బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదా?” అని ప్రశ్నించారు. ఈ సారి కేంద్ర బడ్జెట్ లో   జమ్మూకాశ్మీర్ కు రూ.17 వేల కోట్లు కేటాయించామని, అందులో పోలీస్ డిపార్ట్ మెంట్ కే రూ.12 వేల కోట్లు ఇచ్చామన్నారు.

తెలంగాణకు బడ్జెట్​లో వేల కోట్లు ఇచ్చినం

తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలకు బడ్జెట్​లో రూ. వేల కోట్లు  ఇచ్చామని నిర్మల తెలిపారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో టెక్స్ టైల్స్ పార్కులు ప్రకటించామన్నారు. ‘‘ఏపీ, తెలంగాణలో మోటుమర్రి–విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు ఇచ్చాం. భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రూ.770 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు నిధులిచ్చాం. ఏపీ, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు  మొత్తం రూ.1,596 కోట్లు కేటాయించాం. 

తెలంగాణ-–మహారాష్ట్రలో రూ.4,686 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం. హిమాచల్​ప్రదేశ్, మహారాష్ర్ట తదితర రాష్ర్టాలకూ నిధులిచ్చాం. కానీ వాటి పేర్లు ప్రస్తావించలేదు. అంతమాత్రాన నిధులివ్వనట్లా? ’’ అని ప్రశ్నించారు.