మోటార్లకు మీటర్లు పెడ్తమని ఒప్పుకున్నది మీరే

  • మోటార్లకు మీటర్లు పెడ్తమని ఒప్పుకున్నది మీరే
  • విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి
  • అప్పుల లెక్క చెప్పిన హరీశ్.. భూములు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పలేదు? 
  • అబద్ధాలు చెప్పుట్ల ఆయనను మించినోళ్లు లేరు 
  • బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ 
  • అసెంబ్లీలో సీఎం రేవంత్, హరీశ్ రావు మధ్య వాడీవేడి చర్చ

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడ్తమని ఒప్పుకు న్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2017లోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. కేంద్రంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న​ దుర్మార్గపు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థల మెడ మీద కత్తి  వేలాడుతున్నదని అన్నారు. ఒప్పందాలు అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటుందని, దీంతో విధిలేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 


బీఆర్ఎస్​వాళ్లు ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుని, తెలంగాణ ప్రజలకు  క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దంటూ తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని హరీశ్ రావు అన్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ఆధారాలతో సహా హరీశ్ కు కౌంటర్ ఇచ్చారు. 

2017 జనవరి 4న కేంద్రంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ కాపీని సభలో చదివి వినిపించారు. ఈ ఒప్పందంపై ప్రభుత్వం తరఫున అప్పటి ఇంధనశాఖ స్పెషల్​సెక్రటరీ అజయ్ మిశ్రా, సదరన్​డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, నార్తర్న్​డిస్కం సీఎండీ గోపాల్​రావు సంతకాలు చేశారని వెల్లడించారు. ఈ విషయంలో సభను తప్పుదోవ పట్టిస్తున్న హరీశ్​రావుకు అగ్రిమెంట్ డాక్యుమెంట్లు అందించడంతో పాటు, ఆయన చెప్పిన అబద్ధాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్​కు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదు.. 

ప్రాజెక్టులు కట్టడంతో అప్పులు అయ్యాయని చెబుతున్న హరీశ్​రావు.. వేల కోట్ల విలువైన భూములను అమ్మిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్​నిలదీశారు. నిజాలను కప్పిపుచ్చడం, అబద్ధాలను ప్రచారం చేయడంలో హరీశ్​రావు ఆరితేరారని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లతో కట్టారని ఇన్నిరోజులు మేమంటే.. కాదు రూ.80 వేల కోట్లే అని బీఆర్ఎస్​వాళ్లు పదేపదే చెప్పారు. 

కానీ ఇప్పుడు హరీశ్ రావు రూ.94 వేల కోట్లు అంటున్నడు. ఆ ప్రాజెక్టు ఉన్నదా? కూలిందా? అని నిన్నటికి నిన్న పోయి చూసి వచ్చిన్రు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘అర్థవంతమైన చర్చకు మాకేం అభ్యంతరం లేదు. కానీ జనం శిక్షించిన తర్వాత కూడా ఇంకా అవే అబద్ధాలు,  ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో  లెక్క తేల్చారు.. ఆ లెక్కతోని సరిపోలేదని ఇట్లనే తొండి లెక్కలు చెప్తే పార్లమెంట్​ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. అయినా మీ ఆలోచనా విధానం మారలేదు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి అసెంబ్లీని వేదిక చేసుకోవడం కరెక్ట్​ కాదు’’ అని హరీశ్​కు సీఎం రేవంత్ చురకలంటించారు. 

ఓఆర్ఆర్ ను అగ్గువకు అమ్ముకున్నరు.. 

కాంగ్రెస్​ హయాంలోనే 159 కిలోమీటర్ల ఔటర్​రింగ్​రోడ్డు నిర్మించామని సీఎం రేవంత్ తెలిపారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను పల్లిబఠానీలకు అమ్ముకున్నట్టు కేవలం రూ.7 వేల కోట్లకు తెగనమ్మారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ‘‘గొర్రెల పథకం కింద జరిగిన అక్రమాల  లెక్కలు తేలుతున్నాయి. పంపకాల్లో తేడాలొచ్చి వాళ్లే కంప్లయింట్​చేస్తే, ఏసీబీ రంగంలోకి దిగి తడిమి చూస్తే రూ.700 కోట్లు దిగమింగినట్టు తేలింది. 

నమ్మితే ప్రాణం ఇచ్చే కురుమలు, యాదవ సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నరు’’ అని ఫైర్ అయ్యారు. గొప్ప పథకం అని చెప్పుకున్న బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బతుకమ్మ చీరలను చాలా వరకు సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేసిన్రు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నరు. బతుకమ్మ చీరలను మహిళలు ఎవరూ కట్టుకుంటలేరు. అవి పంట పొలాల్లో పిట్టలను భయపెట్టడానికి ఉపయోగిస్తున్నరు’’ అని అన్నారు. కేసీఆర్ నిజాయతీగా పాలన చేసి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ మీద విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 

మహిళలను అవమానించారు: హరీశ్  

తాము ఓఆర్ఆర్‌‌ ‌‌ను అమ్మలేదని, అది తిరిగి ప్రభుత్వానికే వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చయ్యాయని తాము మొదటి నుంచీ చెబుతున్నామని తెలిపారు. బతుకమ్మ చీరలపై అసత్యాలు చెప్పి మహిళలను అవమానించారని, ఇందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా ఆ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

పదేండ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? 

2006లో కేసీఆర్ వలస వస్తే పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపించారని, కానీ పదేండ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. పాలమూరు మీద కేసీఆర్‌‌ ‌‌  కు ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. ‘‘ కరీంనగర్​ ప్రజలు ఓడగొడ్తరని వలసలు పోయే పాలమూరు జిల్లాకు కేసీఆర్ వలస వస్తే... ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని, భుజాల మీద మోసుకుని పార్లమెంట్​కు పంపించారు. 

కానీ ఆదరించిన పాలమూరుకు ఆయన అన్యాయం చేసిన్రు. వలస పోయిన పాలమూరు బతుకులు నాడు ఎట్లున్నయో.. బీఆర్ఎస్​పాలనలో అట్లే ఉన్నయ్. జిల్లాలో ఏ ప్రాజెక్ట్​ను చూసినా పదేండ్ల కింద ఎట్లున్నయో గట్లనే ఉన్నయ్’’  అని అన్నారు. ఆనాడు వైఎస్​రాజశేఖర్​రెడ్డిని ఇక్కడి ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ల దాకా తెప్పిస్తే.. దాన్ని మెదక్​జిల్లా వరకు నియంత్రించి రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చే కుట్ర పన్నారని ఆరోపించారు. 

‘‘ఈ రోజు 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా, రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రాకుండా కుట్ర చేసిన్రు. కానీ రంగారెడ్డి జిల్లాలోని లక్షల కోట్ల విలువైన భూములు, ఆస్తులను అమ్ముకున్నరు. ఇంకా సిగ్గు లేకుండా ఏదో వెలగబెట్టామని మాటలు చెబుతున్నరు’’ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ మండిపడ్డారు.  

జనం శిక్షించిన తర్వాత కూడా ఇంకా అవే అబద్ధాలు,  ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో  లెక్క తేల్చారు.. ఆ లెక్కతోని సరిపోలేదని ఇట్లనే తొండి లెక్కలు చెప్తే పార్లమెంట్​ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. అయినా 
బీఆర్​ఎస్​ ఆలోచనా విధానం మారలేదు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి అసెంబ్లీని వేదిక చేసుకోవడం కరెక్ట్​ కాదు.- సీఎం రేవంత్​రెడ్డి