మీకు తెలుసా : 2 వేల సంవత్సరాల నాటి బుగ్గ ఆలయం.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణలోనే ఉంది..

రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది. దీని గురించి ఈ ఏరియాలో తెలియనివాళ్లు ఉండరు. చోళ రాజుల కాలంలో ఈ బుగ్గ రాజేశ్వరాలయాన్ని కట్టించారు. ఇక్కడికి ఎక్కడెక్కడినుంచే లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులను కట్టిపడేస్తుంది.

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి దగ్గరలో బుగ్గరాజరాజేశ్వరస్వామి ఆలయం ఉంది.  ఈ దేవాలయానికి చుట్టుపక్కలరాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.    మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ దేవాలయంలో జాతర జరిగే రోజుల్లో  లక్షలాది మంది స్వామిని దర్శించుకుంటారు. భక్తులు రాత్రి దైవసన్నిధిలో నిద్ర చేసి, ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎడ్లబండ్లపై వచ్చి ఎంతో నిష్టతో ఉండి ఇష్టదైవాన్ని ఆరాధిస్తారు.  ఆలయ ప్రాంగణంలోనే వంటలు చేసుకుని తిని, ఇళ్లకు ప్రయాణం అవుతారు.

ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే

గర్భగుడిలోని శివలింగంపై నిరంతరంగా గంగాజలం పడుతుంటుంది. మహిమాన్నిత దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అయితే ఈ గంగాజలం వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే.. పూర్వకాలంలో దేవతాసంభూతుడైన ఆఘోర యోగి పుంగవుడు చిత్రకూట పర్వత శ్రేణుల నుంచి ఈ ప్రాంతానికి వచ్చాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ తపన్సు చేసుకుంటూ ..   కాశీకి వెళ్లి వస్తుండేవాడు. ఆ యోగికి ఉన్న శక్తుల వల్ల 60 గడియలోనే(24 గంటలు) కాశికి వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఇలా కొన్నేళ్ల తర్వాత ఆ యోగికి వృద్ధాప్యం వచ్చింది. దాంతో ఒక రోజు  కాశీకి వెళ్లలేక బాధపడ్డాడు.  స్వామి నన్ను మన్నించు" అని ఏడుస్తూ. శివుడిని ధ్యానిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఆ యోగి భక్తికి మెచ్చి  రాజరాజేశ్వరుడు ప్రత్యక్షమై 'ఇకపై నీవు కాశీకి రానవసరం లేదు. నేను నీ కోసం ఇక్కడే కొలువై ఉంటాను. మూడు గుట్టల నుంచి లిప్తకాలం పాటు కూడా ఆగకుండా వస్తూ గంగ నన్ను సేవిస్తుంది. అని చెప్పి మాయమైపోయాడు. అని స్థానికులు చెప్తారు. అందుకే శివలింగంపై గంగాజలం ఆగకుండా పడుతుందంచారు.

ALSO READ | Under ground village: భూమిలో ఊరు .. రత్నాలకు నిలయం.... ఎక్కడ ఉందో తెలుసా..

ఆహ్లాదకరంగా...

ఆధ్యాత్మికతతో పాటు ఈ ప్రాంతం భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆంజనేయస్వామి. అయ్యప్పస్వామి మాలధారణ చేసే భక్తులు కూడా ఇక్కడే ఉంటారు. రాజరాజేశ్వరుడి గుడి పక్కవ ఎప్పుడూ ప్రవహించే నీటి ఊట కోనేటిలో పడుతుంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గుడికి ఎదురుగా ఎత్తైన పచ్చని గుట్ట, గుడి వెసుక రెండు గుట్టలు ఎంతో అందంగా కనిపిస్తాయి. గుడి చుట్టూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లు కనిపించే ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడ కింద భక్తులు. పర్యాటకులు వంటలు చేసుకుని, తిని ఆనందంగా గడుపుతారు.

ఎలా వెళ్లాలి

 బుగ్గరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం లేదు. ఆలయానికి వెళ్లాలి అనుకునే వాళ్లు ముందుగా బెల్లంపల్లికి రావాలి. బెల్లంపల్లి పాతబస్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయి ఆటోలో ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రోడ్డు కూడా ఉంది.