- రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో ప్రమాదవశాత్తూ రెండు ఇండ్లు దగ్ధం అయ్యాయి. గ్రామానికి చెందిన ఇంగిలి శ్రీనివాస్, ఇంగిలి లింగయ్య బంధులువులు. వీరి ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. సోమవారం ఇరు కుటుంబాలు జైపూర్ మండలంలోని వేలాల దేవాలయానికి వెళ్లారు. శ్రీనివాస్ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న లింగయ్య ఇంటికి సైతం అంటుకున్నాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలు ఆర్చారు. అప్పటికే రెండు ఇండ్లలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. లింగన్న కూతురుకు ఇటీవలే వరపూజ జరిగింది. ఆమె పెండ్లి కోసం ఇంట్లో దాచిన 8 తులాల బంగారం, రూ.4 లక్షల నదుతోపాటు శ్రీనివాస్ కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.2 లక్షలతో పాటు 2 తులాల బంగారం పూర్తిగా కాలిపోయాయని బాధితులు బోరుమన్నారు. చెన్నూర్ ఎస్ఐ సుబ్బారావు కాలిపోయిన ఇండ్లను పరిశీలించారు. మొత్తం సూమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.