కారుతో ఢీకొట్టి యువకుడిని చంపిన కేసులో ఇద్దరు అరెస్ట్

జైపూర్(భీమారం), వెలుగు : బైక్ పై వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి చంపిన కేసులో ఇద్దరు నిందితులను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలం రసూల్ పల్లి గ్రామానికి చెందిన చోట సాయి కుమార్ తన భార్యతో అదే గ్రామానికి చెందిన ఆకుదారి మల్లేశ్ (28) వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. 

దీంతో కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన చోటసాయి తన భార్య తండ్రి గట్టు సదయ్యతో కలిసి మల్లేశ్​హత్యకు ప్లాన్ చేశారు.  భీమారం మండలకేంద్రంలో  పెట్రోల్ బంకు సమీపంలో హైవేపై బుధవారం  మల్లేశ్ బైక్ పై వెళ్తున్నాడు. చోటసాయి, గట్టయ్య కారు (AP28 8595)లో వెనుక నుంచి వెంబడించి స్పీడ్ గా బైక్ ను ఢీకొట్టగా అతడు మృతిచెందాడు. 

మృతుడి తల్లి ఆకుదారి రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం చోట సాయిని రసూల్ పల్లి ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా మల్లేశ్​ను  కారుతో ఢీకొట్టి హత్య చేశామని ఒప్పుకున్నాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.  శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ ఉన్నారు.