మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం: కేటీఆర్​

  • లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నయి
  • రాజకీయ కక్షతో కేసీఆర్‌‌ను బద్నాం చేసేందుకే పంపింగ్ చేయట్లే
  • ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి లోయర్​ మానేరు డ్యామ్ సందర్శన

కరీంనగర్, వెలుగు: చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఎనిమిది నెలలుగా మేడిగడ్డ కొట్టుకపోతదని, రూ.లక్షల కోట్లు వృథా అయ్యాయని కాంగ్రెస్ లీడర్లు చేసిన ప్రచారం వట్టిదేనని ఇప్పుడు తేలిపోయిందన్నారు.

 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా నిలబడిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బరాజ్ పర్యటనకు బయల్దేరిన ఆయన గురువారం సాయంత్రం కరీంనగర్ లో లోయర్ మానేరు డ్యామ్ ను విజిట్​చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ బరాజ్ లు, రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల కాల్వలతో ప్రపంచంలోనే అతిపెద్దదయిన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించడం వల్ల తెలంగాణ ధాన్య భాండాగారమైందన్నారు. 

 

సీఎం రాజకీయాలు పక్కన పెట్టి పంపింగ్ చేయాలి

ఏడాది క్రితం లోయర్ మానేరు డ్యామ్​లో 12 టీఎంసీల నీళ్లు ఉండేనని,  వారం రోజుల్లో మరో12 టీఎంసీలను పంపింగ్ ద్వారా నింపినట్లు కేటీఆర్ ​గుర్తు చేశారు. ఈ సారి 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, ఖాళీగా ఉన్న రిజర్వాయర్లను నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆఫీసర్లు చెప్తున్నారని తెలిపారు.  మేడిగడ్డ వద్ద పంపింగ్ చేయకపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని, మరోవైపు తక్కువ వర్షపాతం నమోదైందని, నీళ్లు నిండలేదని సాకులు చెప్పి రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. 

ఎస్సారెస్సీలో 90 టీఎంసీలకు 23, 24 టీఎంసీలు, మిడ్ మానేరులో 5 టీఎంసీలు, ఎల్ఎండీలో 5 టీఎంసీలు ఉందని, మొత్తం 35 టీఎంసీల నీళ్లు లేవని, మల్లన్నసాగర్ లో 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చవచ్చన్నారు. ఎన్నికలు అయిపోయాయని, సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యాం లకు పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో క్షేత్ర స్థాయి పర్యటనకు బయల్దేరినట్లు తెలిపారు. వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.