ఏజెన్సీలో రేషన్​ పరేషాన్..ఇంటర్నెట్ నిలిపివేతతో తప్పని తిప్పలు

  • ఇంటర్నెట్ నిలిపివేతతో తప్పని తిప్పలు

ఆసిఫాబాద్/ జైనూర్, వెలుగు : కుమురం భీం జైనూర్ లో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లతో ఇంటర్నెట్​ సేవలు నిలిపివేయడంతో పేదలకు రేషన్  బియ్యం అందని పరిస్థితి నెలకొంది. సోషల్  మీడియాలో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్  సేవలను నిలిపివేశారు. దీంతో జిల్లాలోని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, తిర్యాణి, వాంకిడి  మండలాల్లో బయోమెట్రిక్  ద్వారా రేషన్  బియ్యం పంపిణీ చేయడం సాధ్యం కావడం లేదు. ఈ ఆరు మండలాల్లో 30 వేల మంది లబ్ధిదారులకు 1,800 క్వింటాళ్ల బియ్యం అందించాల్సి ఉంది.

ఇదిలాఉంటే స్థానికంగా రేషన్  బియ్యం పంపిణీ జరగకపోవడంతో 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్  జిల్లా ఉట్నూర్  మండలంలోని రేషన్ షాపులను ఆశ్రయిస్తున్నారు. బియ్యం తెచ్చుకునేందుకు వెహికల్స్  కిరాయి భరించాల్సి వస్తోందని అంటున్నారు. ఇంటర్నెట్  సేవలు పునరుద్ధరణ సాధ్యం కాని పరిస్థితుల్లో గతంలో మాదిరిగా మాన్యువల్  పద్ధతిలో పంపిణీ చేయాలని కోరుతున్నారు. 

బియ్యం అందించేందుకు చర్యలు..

జైనూర్ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలోని జైనూరు, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి, కెరమెరి, వాంకిడి  మండలాల్లో ప్రత్యామ్నాయ మార్గంలో రేషన్  బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆసిఫాబాద్  కలెక్టర్  వెంకటేశ్  ధోత్రే తెలిపారు. ఇప్పటికే సివిల్  సప్లై కమిషనర్ తో పాటు పోలీస్  ఆఫీసర్లతో మాట్లాడామని చెప్పారు. అవసరమైతే మాన్యువల్ గా రేషన్  అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

కుదుటపడుతున్న జైనూర్..

ఇరువర్గాల ఘర్షణతో అట్టుడికిన జైనూర్ లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 144 సెక్షన్  సడలించడంతో వ్యాపార సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అనుమతించని పోలీసులు, స్థానికులను మాత్రం బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇరువర్గాల పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోలీస్  బందోబస్తు కొనసాగుతోంది.