ఉద్రిక్తల మధ్య స్టూడెంట్‌‌‌‌ శైలజ అంత్యక్రియలు

  • ఫుడ్‌‌‌‌పాయిజన్‌‌‌‌తో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయిన స్టూడెంట్
  • సవాతిదాభా గ్రామంలో డెడ్‌‌‌‌బాడీతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
  • గ్రామంలో పోలీసుల ఆంక్షలు, బయటి వ్యక్తులకు నో పర్మిషన్‌‌‌‌
  • పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్ బాబు 
  • రెండెకరాల భూమి, ఉద్యోగం, పరిహారం ఇప్పిస్తామని హామీ

ఆసిఫాబాద్,​ వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌తో  స్టూడెంట్‌‌‌‌ చౌదరి శైలజ (14) చనిపోవడంతో ఆమె స్వగ్రామం వాంకిడి మండలం సవాతిదాబాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి మృతికి నిరసనగా కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు సిద్ధపడడంతో సమాచారం అందుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. జైనూర్‌‌‌‌లో ఇటీవల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శైలజ గ్రామంలోనూ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు.

 గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి నుంచే గ్రామంలో బలగాలను మోహరించారు. శైలజ డెడ్‌‌‌‌బాడీని హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్‌‌‌‌ నుంచి బందోబస్తు మధ్య స్వగ్రామం తీసుకొచ్చారు. తమ బిడ్డకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరపబోమని కుటుంబసభ్యులు, బంధువులు డెడ్‌‌‌‌బాడీతో ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన పెద్దది కాకుండా, శైలజ కుటుంబీకులకు మద్దతుగా ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. స్టూడెంట్‌‌‌‌ కుటుంబానికి మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన ఆసిఫాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని సోమవారం రాత్రి నుంచే హౌస్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ చేశారు.

 ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, గిరిజన సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకొని కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌తో పాటు పలు పోలీస్‌‌‌‌స్టేషన్లకు తరలించారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్‌‌‌‌ ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్ టీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్‌‌‌‌బాబు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌‌‌‌రావు వచ్చి శైలజ డెడ్‌‌‌‌బాడీకి నివాళి అర్పించారు. స్టూడెంట్‌‌‌‌ బంధువులు మినహా ఎవరినీ గ్రామంలోకి అనుమతించలేదు. ఆసిఫాబాద్‌‌‌‌ ఎస్పీ డీవీశ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్‌‌‌‌ ఆలం అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

డెడ్‌‌‌‌బాడీతో ఆందోళన

శైలజ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి, కుల సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. స్టూడెంట్‌‌‌‌ ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం, ఐదెకరాల భూమి, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్సీ దండే విఠల్, డీటీడీ రమాదేవి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్‌‌‌‌బాబు, అధికారులు చర్చలు జరిపారు. ఇల్లుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌‌‌ ఇవ్వడంతో పాటు భూమి, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగం, మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మధ్యాహ్నం శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.