- రసవత్తరంగా మారిన ‘మెతుకుసీమ’ పోరు
- డబుల్ హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ ధీమా
- బీసీ నినాదంతో బీఆర్ఎస్కు చెక్పెడతామంటున్న కాంగ్రెస్
- గెలుపు తమదేనంటున్న బీజేపీ
మెదక్, వెలుగు : మెదక్ లోక్‌సభ స్థానం నుంచి సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక్కడ మొత్తం 44 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య ట్రయాంగిల్ఫైట్జరిగే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సైతం విజయం సాధించి డబుల్‌హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది. అయితే, 25 ఏండ్లుగా ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ సారి గెలుపు తమదేనని, గులాబీ పార్టీ ఆధిపత్యానికి చెక్పెడతామంటున్నాయి.
కాంగ్రెస్ బీసీ నినాదం
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్..లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్చేయాలని అనుకుంటోంది. అయితే, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో బీఆర్ఎస్ను ఓడించడం సవాల్‌గా మారింది. ఈసారి గెలిచి తీరాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తన అభ్యర్థిగా బీసీని బరిలోకి దించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు ముదిరాజ్‌ను ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో మధుకు మంచి పేరు ఉంది. సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు కూడా ఉంది. అయితే, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మధు పెద్దగా తెలియకపోవడం, లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ఎమ్మెల్యే ఉండడం కొంత మైనస్. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం కలిసివచ్చే అంశం. దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం పెరిగింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో యాబై శాతం వరకు బీసీ ఓటర్లు ఉండడంతో నీలం మధు బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులోనూ ఎక్కువ శాతంగా ఉన్న ముదిరాజ్ ఓటర్ల మద్దతు కూడగట్టడంపై స్పెషల్ ఫోకస్‌పెట్టారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్ చెరు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంది. కానీ, సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ వీక్‌గా ఉండగా, ఆ మూడు సెగ్మెంట్లే గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రచారం ముమ్మరం చేసి, ముఖ్యంగా మెజార్టీగా ఉన్న బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా ఓట్ల శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్అభ్యర్థి నీలం మధు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గెలిచి తీరాలని హరీశ్‌రావు పట్టు
ఎమ్మెల్సీ, సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మెదక్నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ఆవిర్భవించినప్పటి నుంచి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మెదక్లోక్సభ స్థానంలో టీఆర్ఎస్అభ్యర్థే ఎంపీగా గెలిచారు. ఈ సారి కూడా గెలుపొంది డబుల్‌హ్యాట్రిక్ కొట్టడం ద్వారా మెదక్ గడ్డమీద గులాబీ పార్టీకి తిరుగులేదని చాటాలని బీఆర్ఎస్భావిస్తోంది. లోక్ సభ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో మెజార్టీగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండడంతో పాటు, సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉన్నందున బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఆయా సెగ్మెంట్లలో పలువురు ప్రజా ప్రతినిధులు, లీడర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం కొంత మైనస్ అయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించి మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తానే అభ్యర్థి అన్నట్టుగా లోక్‌సభ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ముఖ్య లీడర్లు, క్యాడర్ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూసుకుంటున్నారు.
మోదీ చరిష్మాపై బీజేపీ ఆశలు
అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది ఊపు మీదున్న బీఆర్ఎస్, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఆయనకు గట్టిపోటీ ఉంది. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం, యువత ఎక్కువ శాతం బీజేపీ వైపు మొగ్గు చూపడం లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు దోహదం చేస్తుందని కమలం పార్టీ ఆశిస్తోంది. నియోజకవర్గ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే అభిప్రాయం ఉండగా, ఇప్పుడు పరిస్థితి మారి గ్రామీణ ప్రాంతాల్లో సైతం తమ పార్టీకి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని, ఇది తన గెలుపునకు బాటలు వేస్తుందని ఆ పార్టీ అభ్యర్థి భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, దుబ్బాక మినహా మిగతా సెగ్మెంట్లలో మూడో స్థానానికే పరిమితమైనప్పటికీ, పార్లమెంట్ఎన్నికల్లో మెజార్టీ ఓటర్ల సపోర్ట్ బీజేపీకి ఉంటుందని, తద్వారా తాను గెలుస్తానని రఘునందన్ రావుధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న విశాల్జనసభ సక్సెస్‌కావడంతో బీజేపీలో గెలుపుపై నమ్మకం పెరిగింది.