తండాల తండ్లాట పోగొట్టింది కాంగ్రెస్సే

  • తీజ్​ పండుగలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: గిరిజన తండాల తండ్లాట పోగొట్టింది కాంగ్రెస్సేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగిన గిరిజనుల తీజ్​పండుగలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మహిళలు చేసే నృత్యాలను అనుకరిస్తూ మంత్రి కూడా వారితో కలిసి డ్యాన్స్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనూ, కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడూ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

తండాలకు రోడ్లు, కరెంటు, మంచినీళ్ల సౌకర్యం కల్పించింది కాంగ్రెసే అన్నారు. 1978లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు తీసుకురావడంతోనే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. దేశవ్యాప్తంగా 12కోట్ల మంది గిరిజనులు ఒకే భాష మాట్లాడుతున్నారని, వారి అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా వెనుకబడిన తండాలు, సౌకర్యాలు లేక చదువుకు దూరంగా ఉంటున్న గిరిజనలుంటే గిరిజన మేధావులు, ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే ఏడాది తీజ్​ పండుగను హుస్నాబాద్​లోని బంజారా భవన్​లో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు పద్మ, సరోజన, టీపీసీసీ మెంబర్​ లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​ శివయ్య పాల్గొన్నారు. 

నేషనల్​​కు సెలెక్ట్​అయితే రూ.లక్ష

స్పోర్ట్స్​లో నేషనల్​ లెవల్​కు సెలెక్టు అయిన స్టూడెంట్స్​కు రూ.లక్ష, రాష్ట్ర స్థాయికి వెళ్లినోళ్లకు రూ.50వేలు ఇస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ధ్యాన్ చంద్ జయంతి, క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ ఫొటోకు  పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్​ నియోజకవర్గ విద్యార్థులు క్రీడల్లో మేటిగా నిలవాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్​ స్కూళ్లలో నియోజకవర్గం నుంచి అత్యధికంగా అడ్మిషన్లు పొందాలన్నారు. ఇక్కడి విద్యార్థులు ఏ క్రీడలోనైనా నేషనల్​ లెవల్​కు సెలెక్టు అయితే తాను రూ.లక్ష ఇస్తానన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఆడినవారికి రూ.50వేలు ఇస్తానన్నారు. అన్ని స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులు హుస్నాబాద్​లోని మినీస్టేడియంలో స్పోర్ట్స్​ ప్రాక్టీస్​ చేసుకోవాలన్నారు. సివిల్స్​లో మెయిన్స్ పాస్ అయినవారికి రాజీవ్ గాంధీ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రూ. లక్ష సాయం అందిస్తుందన్నారు.