విద్యుత్ షాక్​తో ట్రాన్స్​కో ఉద్యోగి మృతి

ములుగు, వెలుగు: విద్యుత్ పోల్​ వద్ద  రిపేర్లు చేస్తుండగా, కరెంట్​ షాక్​ తగిలి ట్రాన్స్​కో ఉద్యోగి చనిపోయాడు. ఎస్ఐ వెంకటేశ్వర్ రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం ముద్దునూరు తండా పంచాయతీ పరిధిలోని మామిడిరేవుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు బాలాజీ(35) 15 ఏండ్లుగా ట్రాన్స్ కో లో  ఆర్టిజన్  గ్రేడ్–1 ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో కరెంట్  లేకపోవడతో బొడ్రాయి వద్ద ఉన్న సింగిల్  ఫేస్  ట్రాన్స్​ఫార్మర్ ను ఆఫ్  చేశాడు. 

ఆ తరువాత ఎల్టీ వైర్  చెక్  చేస్తుండగా, రివర్స్  కరెంట్​  వచ్చి షాక్ కు గురయ్యాడు. బాలాజీని ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు. 

పమునూర్​లో కార్మికుడు..

స్టేషన్ ఘనపూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్  మండలం పమునూర్ లో కొత్త పోల్స్, లైన్​ పనులు పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తుండగా, పాలకుర్తి మండలం కొండాపూర్  గ్రామానికి చెందిన బానోతు సోమన్న(30)కు పక్కనే ఉన్న 11 కేవీ వైర్లు తగలడంతో కరెంట్  షాక్ కు గురై చనిపోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజు తెలిపారు. ఇదిలాఉంటే తమకు న్యాయం చేయాలని కోరుతూ డెడ్​బాడీతో సర్కారు దవాఖాన ముందు మృతుడి బంధువులు ధర్నా చేశారు.