నెట్​వర్క్​ కవరేజీ మ్యాప్​ను చూపాల్సిందే

  • వెబ్‌సైట్లలో డిస్‌ప్లే చేయాలని టెలికం కంపెనీలకు  ట్రాయ్ ఆదేశం

న్యూఢిల్లీ : టెలికం కంపెనీలు ఏయే ఏరియాల్లో నెట్‌వర్క్ కవరేజ్‌ను అందిస్తున్నాయో తెలియజేసే జియోస్పేసియల్ కవరేజ్‌ మ్యాప్​ను తమ వెబ్‌సైట్లలో డిస్‌ప్లే చేయాలని టెలికం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది.  క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్‌ (క్యూఓఎస్‌) రూల్స్​ను సవరించడంలో భాగంగా ఈ కొత్త ఆదేశాలు ఇచ్చింది. వైర్‌‌లెస్‌  వాయిస్ లేదా వైర్‌‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసెస్‌లను ఏయే ప్రాంతాల్లో సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందిస్తున్నాయో టెలికం కంపెనీలు పబ్లిష్ చేయాలని ట్రాయ్ పేర్కొంది. 

కవరేజ్ లేని ఏరియాల్లో సంబంధిత టెలికం కంపెనీ నుంచి క్వాలిటీ సర్వీస్‌లను ఊహించలేమని  తెలిపింది. అదే జియోస్పేసియల్ కవరేజ్ మ్యాప్స్ అందుబాటులో ఉంటే  కన్జూమర్లు తమ ఏరియాల్లో క్వాలిటీ కవరేజ్ అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌‌ను ఎంచుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. సర్వీస్‌ ప్రొవైడర్లు తాము అందిస్తున్న 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీస్‌ల డేటాను ప్రొవైడ్ చేయాలి. టవర్లు ఎక్కడ ఉన్నాయనేది డిస్‌ప్లే చేయడం ఆప్షనల్‌.