విషాదం నింపిన 31st దావత్.. కొత్త సంవత్సరం రాక ముందుకే తెల్లారిన బతుకులు

కొమురం భీం జిల్లా/మంచిర్యాల జిల్లా: కొత్త సంవత్సరం రాక ముందుకే ముగ్గురు యువకుల బతుకులు తెల్లారిపోయాయి. న్యూ ఇయర్ జోష్ ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. 2024 సంవత్సరం ఆ కుటుంబాల్లో విషాదాంతంగా మిగిలిపోయింది. బెజ్జుర్ మండలం ఇప్పలగూడా గ్రామ సమీపంలో మద్యం మత్తులో అదుపు తప్పి బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చింతల మానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన మేశ్రం సాయి అనే యువకుడు (22) స్పాట్లోనే చనిపోయాడు. 

షణ్ముఖ్, అజయ్ అనే ఇద్దరిని పరిస్థితి ఆసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు బైక్పై ప్రయాణిస్తున్నారు. ముగ్గురూ డిసెంబర్ 31st దావత్ చేసుకున్నారని తెలిసింది. మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. 

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాల దగ్గరలో ఉన్న కడెం మెయిన్ కెనాల్లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 31st దావత్కి వెళ్లి తిరిగి ఇంటికి బైక్పై వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. చనిపోయిన ఇద్దరిని దండేపల్లి మండల కేంద్రానికి చెందిన రాజు (30), పవన్ (28)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | ‘అలా ఎలా కూల్చేస్తారు..?’ ఖాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

ఈ ఘటనలో అత్యంత విషాదం ఏంటంటే.. ప్రమాదంలో చనిపోయిన పవన్ అనే యువకుడికి నెల రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 31st దావత్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు గానీ మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇలా ప్రమాదాల బారిన పడి కన్న వాళ్ల, కట్టుకున్న వాళ్ల జీవితాలను శోకసంద్రంలోకి నెట్టేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ దుర్ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.