కోల్‌బెల్ట్, వెలుగు: తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఐక్య వేదిక లీడర్లు మాట్లాడుతూ.. బొగ్గు బావుల ప్రైవేటీకరణకు ఓపెన్ టెండర్లను రద్దు చేయాలని, రాష్ట్ర సర్కార్ఓపెన్ టెండర్లలో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోవాలని డిమాండ్‌చేశారు.
సింగరేణిని ప్రైవేటీకరణ పేరుతో అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ద్వారా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తిలో 139 ఏండ్ల అపార అనుభవమున్న సింగరేణికి నేరుగా రాష్ట్రంలోని అన్ని బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రియాజ్‌అహ్మద్, జక్కుల నారాయణ, జె.శ్రీనివాస్, సుదర్శన్, పార్వతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.