- ఏజీఎం ఆఫీస్ ఎదుట ధర్నా
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి కాలనీలో తొలగించిన విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపర్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఐఎన్‌టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఏజీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ, కన్నాలబస్తీ, నంబర్ 2 ఇంక్లైన్ బస్తీ, హనుమాన్ బస్తీ, బూడిదిగడ్డ బస్తీ తదితర కాలనీల్లో కనీస సమాచారం లేకుండా కరెంట్ కనెక్షన్ తొలగించడం అన్యాయం అన్నారు.
సింగరేణిలోని వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 3,800 కార్మికులు బెల్లంపల్లిలో ఉంటున్నారన్నారు. కరెంట్ కనెక్షన్ తొలగించడం వల్ల పది రోజులుగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి సింగరేణి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా చూడాలని డిమాండ్ చేశారు.
తాత్కాలిక పునరుద్ధరణకు హామీ
విద్యుత్ పునరుద్ధరణ కోసం కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి విద్యుత్ శాఖ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే మందమర్రి ఏరియా వర్క్‌షాప్ డీవైజీఎం సుబ్రమణ్య హరినారాయణ, ఎస్‌ఈ కృష్ణారెడ్డి కలిసి బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సిద్ధంశెట్టి రాజమౌళి, ఏఐటీయూసీ సీనియర్ నేత రత్నం ఐలయ్యతో శనివారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో చర్చించారు. విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని కోరడంతో తాత్కాలిక పునరుద్ధరణకు ఓకే చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.అఫ్జల్, మునిమంద రమేశ్, మంతెన మల్లేశ్, పొట్ల సురేశ్, అమానుల్లాఖాన్ పాల్గొన్నారు.