ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!

హైదరాబాద్: అక్టోబర్లో కాస్తంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నవంబర్ నెలలో మాత్రం రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఇవాళ(నవంబర్ 22, 2024) బంగారం ధరలు బాగానే పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 870 రూపాయలు పెరిగి 77,950 రూపాయల నుంచి78,820 చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 800 రూపాయలు పెరగడంతో 71,450 నుంచి 72,250 రూపాయలకు పెరిగింది. నవంబర్ 13న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 70,450 రూపాయలు ఉండగా, నవంబర్ 22న 72,250 రూపాయలు పలికింది. 

అంటే.. పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1800 రూపాయలు పెరిగింది. ఇక.. 24 క్యారెట్ల బంగారం ధర అయితే ఇంకొంచెం ఎక్కువగానే పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నవంబర్ 13న 76,850 రూపాయలు ఉండగా, నవంబర్ 22న 78,820 రూపాయలకు పెరిగింది. పది రోజుల్లో 1970 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు పగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. 

రష్యా–ఉక్రెయిన్ మధ్య  యుద్ధం ముదరడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ఇలా రకరకాల కారణాల వల్ల గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోందని  ఎనలిస్టులు పేర్కొన్నారు. రెసిషన్​ సమయాల్లో బంగారానికి డిమాండ్​ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏడుసార్లు రెసిషన్ రాగా, ఐదుసార్లు బంగారంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.

ఇన్ఫ్లేషన్​ పెరిగినా బంగారానికి డిమాండ్​ పెరుగుతుంది. స్టాక్స్​, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది. ఇక.. వెండి ధరలను పరిశీలిస్తే.. శుక్రవారం నాడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,01,00 రూపాయలుగా ఉంది.