కాగజ్ నగర్, వెలుగు: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు బురదమయంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారడంతో ఆ గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రోడ్డును బాగుచేసుకున్నారు. బెజ్జూర్ మండలం తిక్కపల్లి నుంచి పాపన్నపేటకు వెళ్లే రహదారి ఇటీవలి భారీ వర్షాలకు ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రోడ్డు మీదకు చేరి బురదమయంగా మారింది.
దీంతో ఆ రోడ్డుపై ప్రజలు నడిచేందుకు కూడా అవస్థ పడ్డారు. పాపన్నపేట మాజీ ఎంపీటీసీ లంగారి శ్రీను, బెజ్జూర్ సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ దందేరా ఇస్తారి తిక్కపల్లి గ్రామస్తులకు సహకారం అందించగా ట్రాక్టర్ల ద్వారా మొరం వేసి శ్రమదానంతో రోడ్డును బాగు చేసుకున్నారు. ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.