ఉట్నూర్లో పెద్దపులి సంచారం..భయాందోళనలో స్థానికులు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా ఉట్నూర్, సమీప గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జనవాసాల్లోకి పెద్దపులి వస్తుండటంతో భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా అర్థరాత్రి పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోని ఆందోళన చెందుతున్నారు. 

ఉట్నూర్ పరిసరప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆదివారం ( నవంబర్17) అర్థరాత్రి ఉట్నూర్ లో రోడ్డు దాటుతూ కారుకు అడ్డంగా వచ్చింది. దీంతో కారులో ఉన్నవారు వీడియో తీసి షేర్ చేశారు. 

శనివారం నాడు ఉట్నూర్ మండలంలోని చీమనాయక్ తండా, నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పెద్దపులి సంచరిస్తున్న ఉట్నూర్ పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.