తెలంగాణ- మహారాష్ట్ర హైవేపై పెద్దపులి

  •     మహారాష్ట్రలోని అమృత్ గూడ సమీపంలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారం కొనసాగుతోంది. ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మీద గురువారం పులి కనిపించడం కలకలం రేపింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్ గూడ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో పులి కనిపించడంతో రైతులు, కూలీలు అరుపులు కేకలు వేస్తూ రోడ్డు మీదకు వచ్చారు. దీంతో పులి సైతం ప్రధాన రహదారిపైకి వచ్చి, నడుచుకుంటూ వెళ్లింది. దీన్ని వాళ్లు వీడియో తీయడంతో వైరల్ అయింది. 

అంతర్రాష్ట్ర రహదారిపైకి పులి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు అలర్ట్  అయ్యారు. పులి కదలికలపై నిఘా పెట్టారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అడవిలో పులుల సంచారం రెగ్యులర్ గా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్  ఆఫీసర్లు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక చోట పులి కనిపిస్తుండడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు  గురవుతున్నారు.