- అప్రమత్తమైన ఫారెస్ట్ ఆఫీసర్లు
జన్నారం, వెలుగు : కవ్వాల్ టైగర్ జోన్లోకి ఏండ్లపాటు తొంగిచూడని పెద్దపులి గత నాలుగు రోజుల నుంచి సంచరిస్తోందని ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు. జన్నారం రేంజ్ పరిధిలోని గొండుగూడ బీట్తో పాటు అల్లినగర్, దొంగపెల్లి అటవీ ప్రాంతాల్లో ఈ నెల 22న యానిమల్ ట్రాకర్స్‌తో పెద్దపులి అడుగులను గుర్తించారు. పాదముద్రలను అధికారులు బయటపెట్టనప్పటికీ.. దాన్ని మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం. గత పది రోజుల క్రితం ఆసిఫాబద్ జిల్లా తిర్యాని, గుండాల అడవుల్లో తిరిగిన పెద్దపులి ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్ లో సంచరిస్తున్న పులి ఒక్కటేనని భావిస్తున్నారు.
ఎప్పుడో ఓసారి ఈ ప్రాంతంలోకి వస్తున్న పులి స్థిర ఆవాసం ఏర్పరుచుకోవడం లేదు. 2019లో కవ్వాల్ అడవుల్లో సంచరించిన పులి.. అప్పటి నుంచి మళ్లీ రాలేదు. పులిని రప్పించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చేయని ప్రయత్నం లేదు. పులికి ఆహారంగా శాకాహార జంతువుల కోసం టైగర్ జోన్ పరిధిలో గ్రాస్ ల్యాండ్స్‌ను ఏర్పాటు చేశారు. అయినప్పటికి ఇటు వైపు రాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కాగజ్ నగర్ కారిడార్ ద్వారా ఆసిఫాబాద్ అడవుల వైపు రాకపోకలు సాగిస్తున్నాయి.
మళ్లీ కొన్నేండ్ల తర్వాత పులి గత నాలుగు రోజుల క్రితం కవ్వాల్ టైగర్ జోన్‌లోని గొండుగూడ అడవుల్లోకి రావడంతో ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అడవీ ప్రాంతానికి వెళ్లవద్దని, పశువులను సైతం మేతకు అటు వైపు తీసుకెళ్లొద్దని కోరుతున్నారు. ఇప్పటికైనా పులి కవ్వాల్ టైగర్ జోన్లో స్థిర అవాసం ఏర్పారుచుకునేందుకు అటవీ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాలి.