లక్సెట్టిపేటలో తుపాకీతో బెదిరించి డబ్బు చోరీకి యత్నం

  • గుమస్తా అరవడంతో భయపడి పారిపోయిన దుండగులు
  • మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

లక్సెట్టిపేట వెలుగు: తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. లక్సెట్టిపేట టౌన్ కు చెందిన మద్యం వ్యాపారి అడ్డగురి రమేశ్ తన వైన్స్ షాప్ కౌంటర్ డబ్బులను గుమస్తా లక్ష్మణ్ ప్రతిరోజు రాత్రి ఇచ్చి వెళ్తుంటాడు. గత ఆదివారం రాత్రి గుమస్తా డబ్బులు తీసుకుని ఉత్కూర్ చౌరస్తా లోని కాలనీలో ఉండే ఇంటి వద్దకు వచ్చాడు. 

అప్పటికే రమేశ్ ఇంటి సమీపంలో ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని దొంగలు మాటు వేశారు. గుమస్తా డబ్బులతో గేట్ వద్దకు రాగానే తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించారు. అతను అరవడంతో ఇంట్లోవాళ్లు డోరు తీయడంతో దుండగులు భయపడి పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాలో  రికార్డైంది. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించినట్లు స్థానిక పోలీసులకు రమేశ్​ఫిర్యాదు చేశారు. అయితే.. అది నిజమైన తుపాకీనా.. లేక బొమ్మ తుపాకీనా అనేది ఎంక్వరీలో తేలుతుందని పోలీసులు తెలిపారు.