- మంచిర్యాల జిల్లాలో పాల వ్యాన్ బోల్తా..ఇద్దరు మృతి
- బొక్కలగుట్టలో లారీని ఢీకొట్టిన కారు ..ఒకరు కన్నుమూత
- నాగర్‌కర్నూల్‌జిల్లాలో కానిస్టేబుల్..
- అన్ని చోట్లా కలిపి 12 మందికి తీవ్ర గాయాలు
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మందమర్రి నేషనల్ హైవేపై తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్లు జరిగాయి. మందమర్రి మండలం అందుగులపేట నుంచి కరీంనగర్ డెయిరీ పాల ప్యాకెట్లను వ్యాన్‌లో బెల్లంపల్లికి తీసుకెళ్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాన్ సోమగూడెం సమీపంలోని కల్వరీ చర్చి వద్ద రాగానే కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో అందుగులపేటకు చెందిన నవనందుల మల్లేశ్ (22), మందమర్రికి చెందిన బైరనేని భద్ర (18) చనిపోయారు. బైరనేని శంకర్‌కు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు. సీఐ శశిధర్ రెడ్డి, కాసీపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఓవర్‌స్పీడ్‌గా.. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పెండ్లికి అటెండ్ అయి తిరిగి వస్తూ..
మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారీ మైస మ్మ ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు చనిపోయారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామానికి చెందిన బీజేపీ నేత మేకల చంద్రశేఖర్ (40) అలియాస్ మున్నా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన పెండ్లికి హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున 5గంటల గాంధారి మైసమ్మ టెంపుల్ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ చనిపోయాడు.
డ్రైవర్ దుర్గం చంద్రశేఖర్, మరో మహిళ అంజలి, చిన్నారులు దుర్గం రాఘవి, దుర్గం లాస్య ప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ పరిశీలించారు.
రెండు బైక్‌లు ఢీకొని..
అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని హైదరాబాద్ చౌరస్తా సమీపంలో రెం డు బైక్‌లు ఢీకొని కానిస్టేబుల్ చనిపోయాడు. అచ్చంపేట మండలం శివారు తండాకు చెందిన శ్రీను నాయక్(32) అమ్రాబాద్ మండలం ఈగలపెంట పీఎస్‌లో కానిస్టేబుల్. సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని అచ్చంపేటకు వస్తుండగా ఆయన బైక్‌ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో శ్రీను నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని అచ్చంపేట హాస్పిటల్ కు తరలించారు. మృతుడికి భార్యతో పాటు పాప ఉన్నారు.
ఆటోబోల్తా : మహిళలు, పిల్లలకు గాయాలు
చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో స్టేట్ హైవేపై కారును తప్పించబోయిన ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో మహిళలు, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. జూలపల్లి మండలం తేలుకుంట, చొప్పదండికి చెందిన లక్ష్మి, లింగవ్వ, రేఖతో పాలు మరో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు చొప్పదండి నుంచి కాట్నపల్లిలో ఉన్న వారి బంధువుల ఇండ్లకు వెళ్లేందుకు చొప్పదండిలో ఆటో ఎక్కారు.
కొలిమికుంట వద్దకు రాగానే ఆటో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన ఆటో బోల్తాపడగా నలుగురు మహిళలతోపాటు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు. ఎస్సై అనూష మాట్లాడుతూ ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఆటోతో పాటు కారును, పీఎస్‌కు తరలించామని చెప్పారు..