బస్టాండ్​లో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు .. ముగ్గురు ప్రయాణికులకు గాయాలు

  • నిర్మల్​ జిల్లా భైంసాలో ఘటన  

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా భైంసా ఆర్టీసీ బస్టాండ్​లో గురువారం స్లాబ్​పెచ్చులు ఊడి మీద పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. 10వ నంబర్​ ప్లాట్​ఫాం వద్ద నిజామాబాద్ జిల్లా నందిపేట్​కు చెందిన శ్రీలత, ఆమె కూతురు సహస్రతో పాటు కుభీర్​ మండలం బెల్గాం గ్రామానికి చెందిన సంగీత బస్సుల కోసం వెయిట్​ చేస్తున్నారు. అప్పుడే పైనుంచి పెచ్చులు ఊడి మీద పడడంతో  శ్రీలత తీవ్రంగా గాయపడింది. 

సహస్ర, సంగీత స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఏరియా హాస్పిటల్​కు తరలించారు. డీఎం హరిప్రసాద్​, అసిస్టెంట్​ మేనేజర్​ శ్రీలత ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించారు. కాగా, 20 ఏండ్ల క్రితం కట్టిన ఈ బస్టాండ్​ కొన్నాళ్ల కింద శిథిలావస్థకు చేరి అప్పుడప్పుడూ పెచ్చులు ఊడిపడుతున్నాయి. 2022 జూన్​9న కూడా ఇదే తరహాలో పెచ్చులూడి మీద పడడంతో  ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అప్పటి అధికారులు నామమాత్రంగా రిపేర్లు చేసి రంగులు వేసి వదిలేశారు. ఇప్పడు దాని సమీపంలోనే పెచ్చులు ఊడిపడ్డాయి.