ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతు

  • స్నానం చేసేందుకు నీళ్లలో దిగిన స్నేహితులు
  • ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటమునిగిన యువకులు
  • ఆసిఫాబాద్ ​జిల్లాలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మిత్రులు గల్లంతయ్యారు. ఎంత గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఈ ఘటన శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌‌  మండలం‌‌ సోమిని సమీపంలోని ప్రాణహిత నది వద్ద జరిగింది. బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ కు చెందిన జహీర్​ హుస్సేన్ (24), ఇర్షద్ (20), మోసిద్​ (22), కాజీమ్​ నలుగురు స్నేహితులు. జహీర్​ హుస్సేన్ కు మండల కేంద్రం లో చెప్పుల షాప్ ఉండగా.. మిగిలిన ముగ్గురు షాపుల్లో పనిచేస్తూ ఉంటారు. ప్రతి శనివారం మండల కేంద్రంలో దుకాణాల బంద్  పాటిస్తుంటారు. 

దీంతో  నలుగురు స్నానం కోసం మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో సోమిని దగ్గర ఉన్న ప్రాణహిత నదికి వెళ్లారు. కాజీమ్​ నది ఒడ్డునే ఉండగా.. మిగిలిన ముగ్గురు  స్నానం చేసేందుకు ఎర్రబండ రేవులోకి దిగారు. ఈ సమయంలో నదిలో నీటి మట్టం ఎక్కువగా  ఉండడంతో  ప్రమాదవశాత్తు నీటిలో మునిగి, గల్లంతయ్యారు.  వీరు గల్లంతైనట్లు కాజీమ్.. కుటుంబీకులకు, పోలీసులకు ఫోన్​లో తెలిపాడు.  కుటుంబీకులు, బెజ్జూర్ ఎస్సై విక్రమ్, రెవెన్యూ ఆఫీసర్లు ఘటనా స్థలానికి  చేరుకున్నారు. గల్లంతైన ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.