- ఉప్మా తిన్న ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత
- టిఫిన్లో బల్లి పడినట్లు అనుమానాలు
రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి మోడల్ కాలేజ్ హాస్టల్ లో మంగళవారం ఉప్మా తిని ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో 100 మంది స్టూడెంట్స్ ఉండగా వారికి ఉదయం టిఫిన్ గా ఉప్మా పెట్టారు. 20 మందికి వడ్డించిన తరువాత అందులో బల్లి కనపడింది. విషయం తెలుసుకున్న స్టూడెంట్లు ఉప్మాను పారబోశారు. కాగా, ఉప్మా తిన్న కొద్ది సేపటికే ముగ్గురు విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు 20 మంది విద్యార్థినులను ట్రీట్ మెంట్ కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అస్వస్థతకు గురై న శ్రీలత, శ్వేతాంజలి, అక్షయను హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఈవో రాధాకిషన్, డిప్యూటీ డీఎంహెచ్వో అనీల స్టూడెంట్స్ ను పరామర్శించారు. అనంతరం హాస్టల్ ను సందర్శించి కిచెన్ లోని వంటలను పరిశీలించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. అంతకుముందు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాస్పిటల్లో స్టూడెంట్స్ ను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.