- తమ్ముడిని కాపాడే క్రమంలో గల్లంతైన అన్నలు
- ఉపాధి కోసం వలస వచ్చిన మహారాష్ట్ర ఫ్యామిలీ
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర గ్రామ సమీపంలోని వాగులో మంగళవారం చేపల వేటకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు వాగులో మునిగి చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన నాగుల్వార్ రాజు,- మీనాబాయి దంపతులు తమ ముగ్గురు కొడుకులు నాగుల్వార్ విజయ్(28), నాగుల్వార్ ఆకాశ్(26), నాగుల్వార్ అక్షయ్(22)తో కలిసి ఉపాధి కోసం తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామానికి వారం రోజుల కింద వలస వచ్చారు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే వివాహాలు జరగగా, చిన్న కొడుకు అక్షయ్‌కు 10 నెలల కుమారుడు ఉన్నాడు. మిగతా ఇద్దరికి సంతానం కాలేదు.
ఎదిగిన కొడుకులను పోగొట్టుకొని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
మంగళవారం సరదాగా ముగ్గురు అన్నదమ్ములు చేపల వేట కోసం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొచ్చర వాగుకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో అక్షయ్ ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడ్డాడు. కండ్ల ముందే తమ్ముడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అతడిని కాపాడేందుకు అన్నదమ్ములిద్దరు వాగులోకి దూకారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో తమ్ముడిని రక్షించబోయి వారు సైతం గల్లంతయ్యారు. వాగు లోతు తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, అన్నదమ్ములు మునిగిపోతున్న సమయంలో అక్కడే ఉన్న వారి బంధువైన మరో యువకుడు కేకలు వేసినా, దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ముగ్గురు గల్లంతయ్యారు.
కొద్దిసేపటికీ అటుగా వెళ్తున్న గ్రామస్తులు వాగువద్దకు వెళ్లినప్పటికీ యువకులు కనిపించకపోవడంతో పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణింధర్, ఎస్ఐ ముజాహిద్ గజ ఈతగాళ్లతో చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ దొరకకపోవడంతో డీడీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో విజయ్ డెడ్‌బాడీ దొరికింది.
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మిగిలిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకులు తమ కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.